దినకరన్ మెడపై కత్తి
అన్నాడీఎంకే డిప్యూటీ సెక్రటరీగా ఇప్పటికీ చెప్పుకుంటున్న టీటీవీ దినకరన్ కు చుక్కెదురయింది. దినకరన్ కు ఎవరూ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఢిల్లీ జాయింట్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. అలా వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ గుర్తుకోసం, పార్టీ పేరు కోసం ఎన్నికల కమిషన్ అధికారులకు లంచం ఇవ్వచూపారన్న కేసులో ఇంకా దినకరన్ నిందితుడే. అయితే ఆయన తనకు ఈ కేసులో క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పుకుంటున్న విషయాన్ని పోలీసులు ఖండించారు. ఈ కేసులో ఇంకా తుది ఛార్జిషీటును దాఖలు చేయాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. శుక్రవారం ఇదే కేసులో బ్రోకర్ గా వ్యవహరించిన సుఖేష్ పై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు.
తుది ఛార్జిషీటు ఇంకా దాఖలు చేయలేదు...
అయితే దినకరన్ మాత్రం తనకు ఢిల్లీ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారని పార్టీ నేతలకు చెప్పుకుంటుండం ఢిల్లీ పోలీసులు చెవిన పడటంతో పోలీస్ కమిషనర్ స్వయంగా వెల్లడించారు. వాస్తవానికి టీటీవీ దినకరన్ బ్రోకర్ సుఖేష్ చంద్రశేఖర్ కు దాదాపు పది కోట్ల రూపాయలను అప్పటికే ఇచ్చారని పోలీసుల విచారణలో తేలింది. ఎన్నికల కమిషన్ అధికారులకు లంచం ఇవ్వడానికే పదికోట్ల రూపాయలు సుఖేష్ కు ఇచ్చినట్లు తేలడంతో దినకరన్ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అరెస్ట్ చేశారు. అయితే ఆయన జూన్ లో దినకరన్ కు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన తనకు క్లీన్ చిట్ ఇచ్చారని చెబుతుండటాన్ని ఢిల్లీ పోలీసులు తప్పుపడుతున్నారు. అంటే దినకరన్ మెడ మీద కత్తి ఇంకా వేలాడుతూనే ఉందని పోలీసులు చెప్పకనే చెప్పారన్నమాట.