ఏపీలో దారుణలను కొద్దిరోజుల్లోనే బయటపెడతా
మరికొన్ని రోజుల్లో ఏపీలో జరుగుతున్న దారుణలను బయటపెడతానని మాజీ చీఫ్ సెక్రటరీ, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. ఐవైఆర్ కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి నుంచి చంద్రబాబు సర్కార్ తొలగించడంతో ఆయన మీడియా సమావేశం పెట్టారు. తనకు బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ కావాలని అడిగి తీసుకున్నట్లు తెలిపారు. అయితే కొన్ని సంఘటనలను తాను ఉన్నవి ఉన్నట్లుమాట్లాడితే ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిందన్నారు. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాకు వినోదపన్ను నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని తాను ప్రశ్నించానన్నారు. ఒక చరిత్రను వక్రీకరించి సినిమా తీస్తే దానికి వినోదపు పన్ను నుంచి మినహాయింపు ఎలా ఇస్తారని ప్రశ్నించడమే నేను చేసిన తప్పా అని ఐవైఆర్ సూటిగా అడిగారు. తనపై గత కొద్ది రోజుల నుంచి టీడీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తుండటం గమనించానని చెప్పారు. తాను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయని వదంతులు పుట్టించారని, తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనబోనని చెప్పారు. నామీద టీడీపీ నేతలు అభాండాలు వేయడానికి అనేక కారణాలున్నాయని తెలిపారు. తాను వైసీపీ లబ్దిదారులకు బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి ప్రయోజనాలు కల్పిస్తున్నానని అసత్య ఆరోపణలు చేస్తున్నారని, అసలు లబ్దిదారుల్లో వైసీపీ, టీడీపీలు ఉంటాయని తనకు తెలియనే తెలియదన్నారు.
ఆరు నెలల నుంచి సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వలేదు....
బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించిన తర్వాత పార్టీకి మైలేజీ రావాలని తనపై వత్తిడి తెచ్చారన్నారు. తాను అందరిలాగా భజన చేసే వాడిని కానని, ఉన్నది ఉన్నట్లు మాట్లాడతానన్నారు. జేసీ దివాకర్ రెడ్డి విశాఖ ఎయిర్ పోర్టులో వీరంగం వేసినప్పుడు కూడా తాను జాతీయనేతలమైనా...స్థానిక నేతల్లా వ్యవహరిస్తున్నామని పోస్టింగ్ పెట్టి తన అభిప్రాయాన్ని మాత్రమే వెల్లడించానన్నారు. అలాగే సోషల్ మీడియాలో పొలిటకల్ సెటైర్లు వేస్తున్న ఇంటూరి రవికిరణ్ ను అరెస్ట్ చేసినప్పుడు కూడా తాను తప్పు పట్టానన్నారు. పొలిటికల్ సెటైర్లను లైట్ గా తీసుకోవాలన్నదే తన అభిమతమన్న ఐవైఆర్ టీటీడీ ఈవోగా ఉత్తరాది ఐఏఎస్ ను నియమించడంపై తాను అభ్యంతరం తెలిపానన్నారు. కొన్ని దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాన్ని ఎందుకు కాలరాయాల్సి వచ్చిందని ఐవైఆర్ ప్రశ్నించారు. తాను ఛైర్మన్ గా ఉన్నా జీతం తీసుకోకుండా సేవ చేస్తున్నానని తెలిపారు. ఫేస్ బుక్ పోస్టింగ్ లపై ప్రభుత్వం తనను కనీసం వివరణ కోరలేదని, తనను రాజీనామా చేయమని చెప్పి ఉంటే ఎప్పుడో రాజీనామా చేసి ఉండేవాడినని తెలిపారు. పార్టీలో జరుగుతున్న విషయాలను చెప్పాలని సీఎం చంద్రబాబును కలిసేందుకు ఆరు నెలలుగా ప్రయత్నిస్తున్నా అపాయింట్ మెంట్ దొరకలేదన్నారు. త్వరలోనే మరిన్ని విషయాలను బయటపెడతానని ఐవైఆర్ చెప్పారు. ఏపీలో జరగుతున్న దారుణాలను మీడియా కూడా బయటపెట్టడం లేదన్నారు. ఏపీ ప్రజలకు వాస్తవాలు తెలిసే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పటి న్యూట్రల్ వార్త వ్యవస్థ ఏపీలో లేదు. సరైన సమాచారం ప్రజలకు వెళ్లడం లేదు. వార్త., ఉదయం లాంటి సమాచారం ఇచ్చే పత్రికలు తెలుగులో లేవు. చంద్రబాబు నాయుడు లగడపాటిని కలిస్తే తప్పు లేదు., నేను కోనా రఘుపతిని కలిస్తే తప్పా...... నాకు రాజకీయ దురుద్దేశాలు ఎందుకు ఆపాదిస్తున్నారు. లోకల్ ఎమ్మెల్యేలను పిలవాల్సిన అవసరం ఉందికాబట్టి పిలిచాను అంతే వేరే ఉద్దేశం లేదని స్పష్టం చేశానన్నారు.