అప్పటి వరకూ ఇక అంతేనా?
కుమారస్వామి మంత్రివర్గ విస్తరణ జరగకపోవడానికి కారణమేంటి? విధాన పరిషత్ ఎన్నికలేనా? వచ్చే నెల 11న విధాన పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. శాసనసభ నుంచి 11 మంది సభ్యులను విధానపరిషత్ కు ఎన్నుకోనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 104, కాంగ్రెస్ కు 78, జనతాదళ్ ఎస్ కు 37 స్థానాలను దక్కిన సంగతి తెలిసిందే. ఈ బలం ప్రకారం చూసుకుంటే విధానపరిషత్ ఎన్నికల్లో బీజేపీకి ఐదుగురు, కాంగ్రెస్ నుంచి నలుగురు, జేడీఎస్ నుంచి ఇద్దరు విధానపరిషత్ కు ఎన్నికయ్యే ఛాన్స్ ఉంది.
విధాన పరిషత్ ఎన్నికల నేపథ్యంలో....
ఈలోపు మంత్రి వర్గ విస్తరణ జరిపితే అసంతృప్తులు తలెత్తే అవకాశముందని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ లోనే ఈ భయం ఎక్కువగా ఉంది. బీజేపీకి కేవలం ఏడుగురు సభ్యుల మద్దతే అవసరం కావడంతో కాంగ్రెస్ నిన్న మొన్నటి వరకూ తన సభ్యులను కంటికి రెప్పలా కాపాడుకుంది. అయితే మంత్రివర్గ విస్తరణ జరిపితే పదవులు దక్కని వారు అసంతృప్తికి గురయ్యే ఛాన్స్ ఉంది. విధాన పరిషత్ ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
కొలిక్కి రాని మంత్రివర్గ కూర్పు....
మరోవైపు పదవుల పందేరంపై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ప్రధానంగా జేడీఎస్ ఆర్థిక శాఖను తమకు కేటాయించాలనికోరుతోంది. ముఖ్యంగా రైతు రుణమాఫీపై ఇప్పటికే కుమారస్వామి ప్రకటన చేశారు. తాము చెప్పినట్లుగానే రైతు రుణమాఫీని చేస్తామని, అయితే కొన్ని పరిమితుల కారణంగా ఇది ఆలస్యమవుతుందని చెప్పారు. దీంతో ఆర్థిక శాఖ తమ వద్ద ఉంటే రైతు రుణ మాఫీ ఆటంకం లేకుండా చేయవచ్చని కుమారస్వామి భావిస్తున్నారు. అందుకే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ తో కూడా ఈవిషయంపైనే చర్చలు జరిపారు. మరోవైపు గతంలో ఉపముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు ఆర్థిక శాఖనుచేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. దీనిపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.
రాహుల్ వచ్చిన తర్వాతనేనా?
మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన తల్లి సోనియాగాంధీ వైద్య పరీక్షల నిమిత్తం విదేశాలకు వెళ్లారు. ఆయన మరో ఐదు రోజుల్లో తిరిగి వచ్చే అవకాశముంది. రాహుల్ వచ్చిన తర్వాతనే మంత్రివర్గం కూర్పు ఒక కొలిక్కి వస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.కుమారస్వామి తాజాగా కొత్త ప్రతిపాదనను కూడా తెరమీదకు తెచ్చారు. శాఖలు కేటాయించకుండా మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయిద్దామని కాంగ్రెస్ నేతల ముందు ప్రతిపాదనలు ఉంచారు. అయితే ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ అంగీకరించలేదని తెలుస్తోంది. మొత్తం మీద మరో వారం రోజుల పాటు మంత్రివర్గ కూర్పుపై ప్రతిష్టంభన కొనసాగుతుందని సమాచారం.
- Tags
- amith shah
- b.s. yadurppa
- bharathiya janatha party
- devegouda
- indian national congress
- janathadal s
- karnataka
- kumara swamy
- narendra modi
- rahulgandhi
- sidharamaiah
- sriramulu
- అమిత్ షా
- కర్ణాటక
- కుమారస్వామి
- జనతాదళ్ రైతు రుణమాఫీ
- దేవెగౌడ
- నరేంద్ర మోదీ
- బి.ఎస్.యడ్యూరప్ప
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- రాహుల్ గాంధీ
- శ్రీరాములు
- సిద్ధరామయ్య