ఉత్తరప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం... ఇది ప్రమాదమేనా?
ఉత్తరప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ రైలు ప్రమాదం వెనక కుట్ర దాగి ఉందా? అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లా ఖతౌలి వద్ద ఈ ప్రమాద సంఘటన చోటుచేసుకుంది. పూరి నుంచి హరిద్వార్ వెళుతున్న కళింగ ఉత్కల్ ఎక్స్ ప్రెస్ లోని ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 10 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. దాదాపు వందల సంఖ్యలో క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ కూడా ప్రమాద ఘటనపై ఆరా తీశారు. అధికారులను అప్రమత్తం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టారు.
పలు అనుమానాలు......
రైలు ప్రమాదానికి గల కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదంలో బోగీలు ఒకదానిపై ఒకటి పడటంతో ప్రయాణికులను బయటకు తీయడం కష్టంగా మారింది. రైల్వే శాఖ ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసింది. ఇది ఉగ్రవాద చర్యా? లేక ప్రమాదఘటనా అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకూ పది మృత దేహాలను వెలికి తీశారు. మరిన్ని మృతదేహాలు బోగీల్లో ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.