ఎంత పని చేశావు స్వామీ...?
సుబ్రహ్మణ్య స్వామి...... తమిళరాజకీయాల్లో పెను ప్రకంపనాలకు కారణమైన వ్యక్తి..... నాడు జయలలిత., నేడు శశికళ ఇద్దరు జైలుకెళ్లడానికి కారణమైన వ్యక్తి..... అధికారాన్ని అడ్డుపెట్టుకుని జయ-శశి జోడి అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్నారంటూ 21 ఏళ్ళ క్రితం న్యాయపోరాటం ప్రారంభించిన ఈ సీనియర్ న్యాయవాది చివరకు అనుకున్నది సాధించారు. అయితే శశికళకు ముఖ్యమంత్రి పదవి అప్పగించాలన్న ఆయన కోరిక మాత్రం తీరలేదు.
శశికి పగ్గాలు అప్పగించాలన్న స్వామి....
1996లో జయలలిత అక్రమ ఆస్తులపై సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ ఇన్నేళ్ల తర్వాత కొలిక్కి వచ్చింది. గత వారం పది రోజులుగా తమిళనాడులో నెలకొన్న అనిశ్చితికి తెరదించాలని కూడా సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేస్తూ వచ్చారు. పూర్తి మెజారిటీ ఉన్న శశికళకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని గవర్నర్ విద్యాసాగర్ రావుకు స్వయంగా విజ్ఞప్తి చేశారు. ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగా సుబ్రహ్మణ్య స్వామి అంతరంగం మాత్రం మరోలా ఉందని సన్నిహితులు చెబుతారు. ఇద్దరు అవినీతి ముఖ్యమంత్రుల్ని జైలుకు పంపిన ఘనత దక్కాలనే స్వామి గవర్నర్‌పై ఒత్తిడి చేయడానికి కారణమని చెబుతారు. భవిష్యత్తులో మరెవరు ఇలాంటి అక్రమాలకు పాల్పడకుండా., ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేలా శశికళను ముఖ్యమంత్రిని చేయడం., ఆ వెంటనే సుప్రీంలో తీర్పు వెలువడితే ఆమెను జైలుకు పంపొచ్చన్నది స్వామి అంతరంగం.
శిక్ష పడుతుందని ముందే .....
నిజానికి అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు శిక్ష పడుతుందని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రమణియన్ స్వామి ముందు నుంచి చెబుతూ వచ్చారు. తీర్పు వెలువడే కంటే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసును పూర్తిగా పరిశీలించానని, దాని ప్రకారం శశికళకు ఖచ్చితంగా శిక్ష పడుతుందని చెప్పారు. అదే సమయంలో శశికళకు మెజారిటీ ఉందని, ఆమెను వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానం పంపాలని, లేకపోతే కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తానని కూడా హెచ్చరించారు. చివరకు శశికళకు పదవి దక్కకుండానే తీర్పు వెలువడింది.