గిరిజనందే తప్పు....ఏపీ మంత్రులు
రంపచోడవరం ఏజెన్సీ లో జరిగిన మరణాలు గిరిజనుల తప్పుతోనే జరిగాయని ఏపీ మంత్రులు తేల్చేశారు. గత నెల 29 నుంచి వ్యాధుల వల్ల మరణాలు సంభవించాయని., విందులో ఆహారం, వాగు నీరు కలుషితం కావడం వల్లే మరణాలు సంభవించాయని నక్కా ఆనంద్‌బాబు చెప్పుకొచ్చారు. ఏజెన్సీ మరణాలపై పరిశీలన జరిపిన మంత్రి తమ జబ్బులకు వైద్యం చేసుకోవాలనే అవగాన కూడా గిరిజనులకు లేకపోవడం వల్లే చనిపోయారన్నారు. చికిత్స పొందుతున్న వారి లో నలుగురు చిన్నారుల పరిస్థితి క్రిటికల్ గా ఉందని., ఏజెన్సీ సమాచారం బయటకు రావడం లో ఆలస్యం వల్ల ప్రాణ నష్టం జరిగిందన్నారు. 16మంది మరణించిన ఘటనలో ప్రభుత్వ వైఫల్యం లేదని పరిస్థితి తెలిసిన వెంటనే అధికారులు రియాక్ట్ అయ్యారని చెప్పుకొచ్చారు.
అవన్ని మామూలే.....
ఇక ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏజెన్సీ మరణాలను చాలా లైట్‌గా తీసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సమస్యలు చాలాకాలం నుండి ఉన్నాయన్ని కామినేని మలేరియా జ్వరాల వల్ల చాపరాయిలో మరణాలు సంభవించలేదని ప్రకటించారు. చనిపోయిన ఆవు అవశేషాలున్న నీటిని తాగటం వల్లే వారు చనిపోయారని., పంచాయితీలో ఒక్క మలేరియా కేసు మాత్రమే నమోదైందన్నారు. 60 కుటుంబాలు మాత్రమే ఏజెన్సీ ప్రాంతంలోని చాపరాయిలో ఉన్నాయని., కొండ ప్రాంతాల్లో ఉన్నవారికి వైద్య సదుపాయాలు అందించడం కష్టమన్నారు. లక్షల రూపాయల జీతం ఇస్తున్నా వైద్యులు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళటం లేదని., ఇకపై రొటేషన్ పద్దతిలో వైద్యుల్ని త్వరలో నియమిస్తామన్నారు. ఘటనకు బాధ్యులెవరైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రేపు, ఎల్లుండి చింతూరు, పచోడవరంలో మంత్రి పర్యటిస్తానని చెప్పారు.