జనసేన స్కెచ్ అదేనా ...?
వచ్చే ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది..? గతంలోలాగే మద్దతు ప్రకటించి ప్రచారంతో సరిపెడుతుందా? ఇలా అనేక యక్ష ప్రశ్నలకు ఆ పార్టీలోనే ఇంకా సరైన క్లారిటీ లేదు. కారణం జనసేనాని తమ బలం తెలుసుకున్నాకే ఏపీ, తెలంగాణాలో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో తేలుస్తామని ఇప్పటికే ప్రకటించారు. దాంతో జనసేన సైనికుల్లో ఇంకా అయోమయం వీడలేదు. పవన్ అంటే పిచ్చిగా అభిమానించే వారు మాత్రం తమ బాస్ చెప్పిందే వేదం అన్న రీతిలో వున్నారు.
175 స్థానాల్లో జనసేన పోటీ.......
ఇది ఇలా ఉంటే సోషల్ మీడియా లో మాత్రం జనసేన పై రోజుకో రకమైన ప్రచారం జనసేన అభిమానులు ఆ పార్టీని వ్యతిరేకించే వారు జోరుగా సాగిస్తున్నారు. తాజాగా 175 అసెంబ్లీ స్థానాల్లో ఏపీలో జనసేన పోటీ చేస్తుంది , సిద్ధం అవ్వండి. మన కేంద్ర కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాల్లో ఈ అంశం పై అధినేత క్లారిటీ ఇచ్చారు అంటూ మెసేజ్ లు వైరల్ గా తిరుగుతున్నాయి. దాంతో జనసేన అభిమానులు ఉత్సహంగా పోస్టింగ్ లు కురిపిస్తుంటే వీరిపై మిగిలిన పార్టీల అభిమానులు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో హాట్ టాపిక్స్ ను క్రియేట్ చేస్తున్నారు.
లాభ నష్టాల అంచనాల్లో పార్టీలు ...
జనసేన 175 అసెంబ్లీ స్థానాల్లో ఒకవేళ పోటీ చేస్తే ఏ పార్టీకి నష్టం ఏ పార్టీకి లాభం అన్న చర్చలు బాగా నడుస్తున్నాయి. ఎన్నికలు దగ్గరపడ్డాక పవన్ ఏదో ఒక పార్టీ పంచన చేరుతారన్న ప్రచారం సాగుతుంది. ఆన్ లైన్ పార్టీ గా పేరు తెచ్చుకున్న జనసేన ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తమ పార్టీ ని ఫోకస్ చేసే పనిలో బిజీగా వుంది. ప్రజలకు వేగంగా చేరువ కావాలంటే ట్రెండ్ కి తగ్గట్టు నడుచుకోవాలన్నది జనసేన ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారం లభించేది సోషల్ మీడియా నే అందుకే కంటెంట్ రైటర్స్ స్పీకర్స్ కి జనసేన శిక్షణ ఇస్తుంది.
జనసేన బలమెంత ...?
ప్రతి నియోజకవర్గంలో 10 వేలమందికి తగ్గకుండా పవన్ హార్డ్ కొర్ ఫ్యాన్స్ ఉంటారని. ఆయన అభిమాన సంఘాలు కట్టే లెక్క . అందులో అత్యధికులు యువతే కావడం విశేషం. వీరిని గుర్తించడం తేలికే . తమ హీరో స్టిక్కర్స్ బైక్ నంబర్ ప్లేట్స్ గా చేగువేరా బొమ్మలతో కనిపిస్తాయి . అలాగే ఆటో వెనుక స్టిక్కర్స్ దర్శన మిస్తాయి. ఇక జనసేన చేపట్టే కార్యక్రమాలకు వీరంతా పవన్ వేసుకునే ఎర్ర తువ్వాలు మెడలో వేసుకోవడం లేదా తలకు చుట్టుకుని ప్రత్యేకంగా కనిపిస్తారు. దాంతో గెలుపు ఓటములను జనసేన ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో ప్రభావితం చేస్తుందని విశ్లేషకుల అంచనా.
- Tags
- జనసేన