విశాఖకు సీఎం కార్యాలయం షిప్ట్.. ఎప్పుడంటే..
ఏపీ సీఎం కార్యాలయం మార్పునకు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. విశాఖకు షిప్ట్ అయ్యేందుకు పనులు చకచక జరిగిపోతున్నాయి...
ఏపీ సీఎం కార్యాలయం మార్పునకు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. విశాఖకు షిప్ట్ అయ్యేందుకు పనులు చకచక జరిగిపోతున్నాయి. అయితే విశాఖకు షిప్టింగ్ అయ్యేందుకు మౌలిక సదుపాయాల ఏర్పాటు, మంత్రుల నివాసాల కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కార్ జీవోను విడుదల అయింది. ఇందుకోసం పట్టణాభివృద్ధి, ఆర్ధిక, సాధారణ పరిపాలనా శాఖా కార్యదర్శులతో ఈ కమిటీ ఏర్పాటైంది. ఈనెల 24న దసరా పండగ రోజున సీఎం ఆఫీస్ విశాఖకు తరలించనున్నారు. అక్కడి నుంచే సీఎం కార్యకలాపాలు కొనసాగించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ పర్యటన ఉండనుంది. ఆ రోజు ముఖ్యమంత్రి రిషికొండ ఐటి హిల్స్‌లో నూతనంగా ఏర్పాటైన ఇన్ఫోసిస్ క్యాంపస్‌ను సందర్శించనున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో ఆ రోజు నుంచి విశాఖలో ఇన్ఫోసిస్ తన కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించనుంది.
వాస్తవానికి విజయదశమి రోజే ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని క్యాంపస్‌ను ప్రారంభించాలని భావించారు. కానీ 16వ తేదీకి క్యాంపస్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుందని.. ఆ రోజు నుంచే కార్యకలాపాలు ప్రారంభించడానికి రెడీగా ఉన్నామని ఇన్ఫోసిస్ కార్యాలయం వెల్లడించింది. దీంతో ఒక వారం పాటు కార్యకలాపాలు ఆగిపోకూడదన్న ఉద్దేశంతో.. ఈనెల 16న ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి విశాఖ వచ్చేందుకు అంగీకరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
కాగా, కరోనా తర్వాత విశాఖ పరిసర ప్రాంతాల్లో 1,400 మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నట్టు ఇన్ఫోసిస్ తెలిపింది. మొదట వారందరినీ క్యాంపస్ నుంచి పని చేసే విధంగా ఏర్పాట్లు చేపట్టింది. వీరంతా ఇకపై విశాఖపట్నం ఇన్ఫోసిస్ క్యాంపస్ నుంచి రెండు షిఫ్టులలో పని చేయనున్నారు. అయితే ఇన్నాళ్లూ వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అలవాటు పడ్డ వ్యవహారాన్ని దృష్టిలో ఉంచుకుని, ఇన్ఫోసిస్ తన ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఓ ప్రణాళికను రూపొందించింది. ఉద్యోగులకు ఒకేసారి ఆఫీస్‌కు రాకుండా మొదటి దశలో తమ ఉద్యోగులు వారానికి రెండు రోజులు హాజరయ్యేలా ప్లాన్ చేస్తోంది. అలాగే రెండవ దశలో వారి సౌకర్యాన్ని బట్టి అవసరమైతే వారికి ఇష్టమైన క్యాంపస్ నుంచి పనిచేసే వెసులుబాటు కల్పిస్తుంది. ఇక మూడో దశలో మొదటి రెండు దశల ఫీడ్‌బ్యాక్‌ను బట్టి ఇన్ఫోసిస్ హైబ్రిడ్ వర్క్ పాలసీని అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నట్టు వివరించింది.