Narendra Modi : ఏపీకి అండగా ఉంటాం.. చేయూతనిస్తాం
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ నుంచి ఏపీ ప్రజలకు వరాల జల్లు ప్రకటించారు
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ నుంచి ఏపీ ప్రజలకు వరాల జల్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆంధ్రయూనివర్సిటీలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సభావేదిక నుంచి వర్చువల్ గా విశాఖపట్నం రైల్వే జోన్ ప్రధాన కేంద్రం సహా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు,కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్, గుంటూరు- బీబీ నగర్, గుత్తి-పెండేకళ్లు రైల్వే లైన్ల డబులింగ్ వంటి పనులకు ప్రధాని శంఖుస్థాపన చేశారు.అలాగే 16వ నంబరు జాతీయ రహదారిలో చిలకలూరి పేట ఆరు లైన్ల బైపాస్ ను జాతికి అంకితం చేయడం తోపాటు పలు జాతీయ రహదార్లు,రైల్వే లైన్ల ను వర్చువల్ గా ప్రధాని ప్రారంభించారు. 2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రధాని మోదీని తొలుత చంద్రబాబు శాలువతో సత్కరించారు. తొలుత ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో మాట్లాడారు.తనపై అభిమానం చూపించిన ఆంధ్రప్రదేశ్ కృతజ్ఞతలు చెప్పే సమయం వచ్చిందని అన్నారు.సింహాచల వరాహ లక్ష్మీనరసింహస్వామికి నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగించారు.