నెమలిని ఎవరైనా చంపితే ఎలాంటి శిక్షలు విధిస్తారు!!

సిరిసిల్లకు చెందిన ఒక యూట్యూబర్ తన ఛానెల్‌లో “సాంప్రదాయ నెమలి కూర రెసిపీ” పేరుతో వీడియోను పోస్ట్ చేయడం సంచలనమైంది
సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన కోడం ప్రణయ్‌కుమార్ అనే వ్యక్తి పోస్ట్ చేసిన ఈ వీడియోలో భారత జాతీయ పక్షి నెమలిని చంపాడని.. దాన్ని వండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించి నెమలి కూరను ఎలా ఉడికించాలో వీడియోలో తెలిపారు. ప్రణయ్‌కుమార్ అడవి పందుల కూర వండడానికి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు
యూట్యూబ్ నుండి ఆ వీడియో తీసివేసినప్పటికీ.. జంతు హక్కుల కార్యకర్తలు అధికారిక దర్యాప్తు కోసం పిలుపునిచ్చారు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహాజన్ సంబంధిత చట్టం ప్రకారం కేసు నమోదు చేశామని తెలిపారు. అలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
భారతదేశ జాతీయ పక్షి నెమలిని వేటాడడం, చంపడం నిషేధించారు. దోషులుగా తేలిన వారికి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు
నెమలి 1963 నుండి భారతదేశ జాతీయ పక్షి.. భారతీయ వన్యప్రాణి (రక్షణ) చట్టం, 1972 యొక్క షెడ్యూల్ I ప్రకారం రక్షిత హోదాను పొందుతోంది
నెమలిని చంపడం నిషేధించారు. సెక్షన్ 51(1-A) ప్రకారం జైలు శిక్ష విధిస్తారు.. ఏడు సంవత్సరాల వరకూ జైలు శిక్ష.. పది వేల రూపాయల వరకూ జరిమానా విధించవచ్చు
వన్యప్రాణి (రక్షణ) చట్టం 1972లోని షెడ్యూల్ I కేటగిరిలో ఉండే నెమళ్ల మరణానికి సంబంధించిన ఏదైనా కేసును తప్పనిసరిగా విచారించి, ప్రాధాన్యతపై పరిష్కరించాలి
నెమలి తోక ఈకలు, వాటితో తయారు చేసిన వస్తువుల బదిలీ, రవాణా, వ్యాపారంపై చట్టంలోని నియంత్రణ నుండి మాత్రమే మినహాయింపులు ఉంటాయి
మతపరమైన, సాంస్కృతిక, జీవనోపాధి అవసరాల కోసం కొన్ని కమ్యూనిటీలు ఈకలను సేకరించి ఉండవచ్చు. ఏ కారణం చేతనైనా నెమళ్లను వేటాడటం పూర్తిగా భారతదేశంలో నిషేధించారు