Mon Dec 23 2024 12:34:01 GMT+0000 (Coordinated Universal Time)
BWF Worlds 2022: నేడు లక్ష్య సేన్ తో తలపడనున్న ప్రణోయ్
అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన ప్రణోయ్ ఎలాంటి అంచనాలు లేకుండానే జపాన్ స్టార్ షట్లర్ ను ఓడించాడు.
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మరో సంచలనం నమోదైంది. భారత యువ షట్లర్ హెచ్ఎస్ ప్రణోయ్ పురుషుల సింగిల్స్‌లో 21-17, 21-16తో రెండో సీడ్ కెంటో మొమోటాపై అద్భుత విజయం సాధించాడు. గంట పాటు సాగిన పోరులో రెండు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన మొమోటాపై ప్రణోయ్ తొలి విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఇరువురి మధ్య ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు జరుగగా మొమోటా ఏడుసార్లు విజయం సాధించాడు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన ప్రణోయ్ ఎలాంటి అంచనాలు లేకుండానే జపాన్ స్టార్ షట్లర్ ను ఓడించాడు. గత మ్యాచ్‌ల్లో మొమోటాపై ఒకే ఒక గేమ్ గెలిచిన ప్రణోయ్, ఈసారి వరుస గేముల్లో అతడిని ఓడించడం విశేషం.
కామన్వెల్త్ సింగిల్స్ విజేత లక్ష్యసేన్ 21-17, 21-10తో లూయిస్ పెనాల్వర్(స్పెయిన్)పై విజయం సాధించాడు. 36 నిమిషాల్లోనే ముగిసిన పోరులో లక్ష్యసేన్ అద్భుత ఆటతీరు కనబరిచాడు. లక్ష్య సేన్ స్పెయిన్‌కు చెందిన లూయిస్ పెనాల్వర్పై వరుస గేమ్‌లతో విజయం సాధించి పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లాడు. లక్ష్య సేన్ ఈ మ్యాచ్ లో 21-17 21-10తో విజయం సాధించాడు. ప్రపంచ ఛాంపియన్షిప్ కాంస్య పతక విజేత అయిన సేన్, స్పానిష్ షట్లర్‌పై తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. మొదటి గేమ్ లో ప్రత్యర్థి కాస్త మంచి గేమ్ ఆడినా.. రెండవ గేమ్‌ను భారీ తేడాతో గెలిచాడు లక్ష్య సేన్. ఈరోజు లక్ష్య సేన్ తో ప్రణోయ్ తలపడనున్నాడు. మేన్స్ సింగిల్స్ లో భారత షట్లర్లు ఒకే గ్రూప్ లో రావడంతో.. ఒక్క భారత ఆటగాడు మాత్రమే క్వార్ట్రర్స్ కు వెళ్లే అవకాశం ఉంది. అనుకున్నట్లుగానే లక్ష్య సేన్ తో ప్రణోయ్ తలపడనున్నాడు. ఇక మాజీ ప్రపంచ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ 9-21, 17-21తో జావో జున్‌పెంగ్(చైనా) చేతిలో ఓడిపోయాడు.
Next Story