Mon Nov 18 2024 02:54:39 GMT+0000 (Coordinated Universal Time)
పండగే పండగ
వన్డే వరల్డ్ కప్ కు అంతా సిద్ధమయింది. మరో వారం రోజుల్లో ప్రపంచ సమరం మొదలు కాబోతుంది.
వన్డే వరల్డ్ కప్ కు అంతా సిద్ధమయింది. మరో వారం రోజుల్లో ప్రపంచ సమరం మొదలు కాబోతుంది. క్రికెట్ ఫ్యాన్స్ కు దాదాపు నెలన్నర రోజులు పండగే పండగ. పసందైన షాట్లు.. అదిరిపోయే సిక్స్ లు, బౌండరీ లైన్ దాటే బంతులు, అద్భుతమైన క్యాచ్ లు, క్లీన్ బౌల్డ్, డకౌట్ లు, సెంచరీలు ఇలా ఒకటేమిటి చూసినోళ్లకు చూసినంత. ప్రతి రోజూ మేటి జట్ల మధ్య మ్యాచ్ లు. యాభై ఓవర్లు కావడంతో కావాల్సినంత కాలక్షేపం. తమ అభిమాన క్రికెటర్లను మైదానంలో చాలా సేపు చూడగలిగిన సౌలభ్యం. ఇలా ఒక్కటేమిటి.. చెప్పుకుంటూ పోతే... నవంబరు మధ్య నెల వరకూ క్రికెట్ ఫ్యాన్స్ కు ఫెస్టివల్ అని చెప్పాలి.
మరో వారంలో...
అక్టోబరు 5వ తేదీ నుంచి నవంబరు 19వ తేదీ వరకూ మ్యాచ్ లు జరగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పది మేటి జట్లు ఈ వరల్డ్ కప్ లో పాల్గొననున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఈ మ్యాచ్ లు మొత్తం ఇండియాలోనే జరగనున్నాయి. భారత్ ఆతిథ్యదేశంగా ఈ ప్రపంచ్ కప్ ను నిర్వహిస్తుంది. ఈ ప్రపంచ కప్ పదమూడోవది. నాలుగేళ్లకు ఒకసారి ఈ వరల్డ్ కప్ జరుగుతుంది. 2019లో వరల్డ్ కప్ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఇండియాలో జరుగుతుంది.
గత వరల్డ్ కప్ ను...
2019లో జరిగిన వరల్డ్ కప్ ను ఇంగ్లండ్ గెలుచుకుంది. ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉన్న ఇంగ్లండ్ జట్టు ఈసారి పోటీలో ముందుటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. సెమీ ఫైనల్స్ మాత్రం ముంబయిలోని వాంఖేడే స్టేడియం, కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్నాయి. ముందుగా అర్హత పొందిన జట్లు మాత్రమే ఈ టోర్నీలో పాల్గొంటాయి. వెస్టిండీస్ మాత్రం ఈసారి అర్హత పొందలేకపోయింది.
పది జట్లు...
ఈసారి వరల్డ్ కప్ లో ఇండియా, ఆప్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు పాల్గొంటాయి. అన్ని జట్లు తమ ఆటగాళ్ల పేర్లను ప్రకటించాయి. పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించాయి. ఈరోజు నుంచి వార్మప్ మ్యాచ్ లు కూడా జరుగుతున్నాయి. హైదరాబాద్ లో పాకిస్థాన్ - న్యూజిలాండ్ ల మధ్య ఈరోజు వార్మప్ మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న జట్లు వార్మప్ మ్యాచ్ ను ప్రారంభించాయి. మరో వారం రోజుల్లో క్రికెట్ ఫ్యాన్స్ కు మాత్రం మంచి కాలక్షేపం అని చెప్పాలి.
Next Story