Mon Dec 23 2024 05:08:01 GMT+0000 (Coordinated Universal Time)
World Cup Semi Finals 2023 : నేడు సెమీ ఫైనల్స్... టాస్ గెలిస్తే సగం గెలిచినట్లేనట
నేడు వరల్డ్ కప్ లో కీలక మ్యాచ్ జరగబోతుంది. ఇండియా - న్యూజిలాండ్ మధ్య సెమీ ఫైనల్స్ జరగనుంది.
నేడు వరల్డ్ కప్ లో కీలక మ్యాచ్ జరగబోతుంది. ఇండియా - న్యూజిలాండ్ మధ్య సెమీ ఫైనల్స్ జరగనుంది. ఇందుకు ముంబయి వాంఖడే స్టేడియం వేదిక కానుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ పై ఎన్నో అంచనాలు వినిపిస్తున్నాయి. పదో విజయం కూడా మనదేనన్న ధీమాతో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. బలమైన జట్టుగా వరల్డ్ కప్ లో తమ ఆటతీరుతో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న భారత్ జట్టు ఈ మ్యాచ్ లోనూ గెలిచి ఫైనల్స్ లోకి నేరుగా అడుగు పెడుతుందని భావిస్తున్నారు.
సెమీ ఫైనల్స్ లోనూ...
లీగ్ మ్యాచ్ లలో తొమ్మిదింటికి తొమ్మిది మ్యాచ్ లలో గెలిచిన రోహిత్ సేన సెమీ ఫైనల్స్ లోనూ తన సత్తా చూపిస్తుందన్న ఆశతో ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా బలంగా ఉన్న జట్టును ఎదుర్కొనడం న్యూజిలాండ్ కు కష్టమేనని అంచనాల వినపడుతున్న నేపథ్యంలో ఈరోజు మ్యాచ్ జరిగే వాంఖడే స్టేడియంలో టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు ఖచ్చితంగా తొలుత బ్యాటింగ్ను ఎంచుకుంటుంది. భారీ స్కోరును నమోదు చేసిన తర్వాత న్యూజిలాండ్ జట్టులోని బ్యాటర్లను కట్టడి చేయాలని భావిస్తున్నారు.
వత్తిడి కూడా...
ముంబయిలో మ్యాచ్ కావడంతో కొంత అలవాటయిన పిచ్ మనోళ్లకు అనుకూలిస్తుందంటున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ వస్తే చితక్కొడతారని భావిస్తున్నారు. మూడు వందలకు పైగానే రన్స్ చేయగలిగితే న్యూజిలాండ్ ను సెమీ ఫైనల్స్ నుంచి ఇంటికి పంపడం పెద్ద కష్టమేమీ కాదన్నది విశ్లేషకుల సయితం అభిప్రాయపడుతున్నారు. నాకౌట్ న్యూజిలాడ్ ను ఇంటికి పంపితే భారత్ ఇక ఫైనల్ లో ఆడనుంది. ఇప్పటికే ముంబయి స్టేడియానికి అభిమానులు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. స్టేడియం మొత్తం అభిమానులతో నిండిపోతుంది. అదే సమయంలో భారత్ పై వత్తిడి కూడా పెరిగింది.
గణాంకాలు...
ఈ మ్యాచ్ లో గణాంకాలు కూడా భారత్ వైపు చూపుతున్నాయి. వాంఖడే స్టేడియంలో భారత్ మొత్తం 21 మ్యాచ్ లు ఆడితే అందులో 12 మ్యాచ్ లలో విజయం సాధించింది. తొమ్మిది మ్యాచ్లలలో ఓడింది. ఇక న్యూజిలాండ్ జట్టు వరల్డ్ కప్ తొలి దశలో ఒక ఊపు ఊపినా ఆ తర్వాత కొంత వెనకబడింది. భయపడుతూనే సెమీస్ కు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. అయితే న్యూజిలాండ్ ను అంత తేలిగ్గా తీసిపారేయడానికి వీలులేదు. రచిన్ రవీంద్ర, కాన్వే లాంటి ఆటగాళ్లున్న జట్టు స్మార్ట్ గేమ్ ఆడుతుందన్న హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. ఇండియాకు పదో విజయం దక్కాలని, ఫైనల్స్ కు చేరాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టీం ఇండియా.
Next Story