Fri Nov 22 2024 19:45:47 GMT+0000 (Coordinated Universal Time)
World Cup 2023 : ఆశలు పెంచేశారు... కప్పు మనదేనన్న నమ్మకంలో ఫ్యాన్స్
వరల్డ్ కప్ లో టీం ఇండియా వరస విజయాలతో సెమీ ఫైనల్స్ కు చేరుకుంది. కప్ కూడా సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు
ఎవరూ ఎవరికి తక్కువ కాదు. అందరూ అందరూ. ఒకరు ఒక మ్యాచ్ లో విఫలమయినా మరొక మ్యాచ్ లో దుమ్ము రేపుతున్నారు. ఎవరినీ తీసి పారేయడానికి వీలు లేదు. వరల్డ్ కప్ లో మనోళ్ల పెర్ఫార్మెన్స్ చూసిన వారెవరైనా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కొహ్లి, శ్రేయస్ అయ్యర్, కె.ఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, జడేజాలు బ్యాటింగ్ లో సత్తా చాటుతున్నారు. ఒకరు ఫెయిలయినా మరొకరు అందుకుంటున్నారు. అదే టీం ఇండియా వరస విజయాలకు కారణమని చెప్పక తప్పదు.
బౌలర్లలోనూ...
ఇక బౌలర్లలోనూ ఐదుగురూ ఐదుగురే. బుమ్రా, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, కులదీప్ యాదవ్, జడేజాలు వికెట్లు తీస్తూ ప్రత్యర్థుల వెన్ను విరుస్తున్నారు. వారు ఎవరిలో ఫామ్ లోకి వచ్చినా అంతే.. అవతలి బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టాల్సిందే. ప్యాడ్ కట్టుకున్నంత సేపు కూడా క్రీజులో నిలవకుండా చేసిన ఘనత మన బౌలర్లదే. నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ను చూస్తే అదే నిజమనిపిస్తుంది. మహ్మద్ షమి ఐదు వికెట్లు, సిరాజ్ మూడు, బుమ్రా మూడు వికెట్లు, జడేజా ఒక వికెట్ తీసి శ్రీలంకను ఇంటికి పంపించగలిగారు.
సమిష్టి కృషితో...
దీంతో నేరుగా సెమి ఫైనల్ కు చేరిన తొలి జట్టుగా భారత్ రికార్డును సొంతం చేసుకుంది. ఏడు విజయాలతో టేబుల్ టాపర్ గా నిలిచింది. ఇది ఏ ఒక్కరితోనే సాధ్యమైన విజయాలు కాదు. ఒక్కో మ్యాచ్లో ఒక్కో ఆటగాడు విజృంభిస్తున్నాడు. బౌలర్ అయినా... బ్యాటర్ అయినా సరే. టీం ఇండియా ఇంత పటిష్టంగా ఉండటం చాలా అరుదుగా క్రికెట్ చరిత్రలో చూశామంటున్నారు. టీం మొత్తం ఒక్కటిగా శ్రమించి ఈ రికార్డుకు చేరువయింది. రానున్న కాలంలో మరిన్ని విజయాల వైపు దిశగా దూసుకెళ్లేందుకు టీం ఇండియా ప్రయత్నించాల్సి ఉంటుంది.
సొంతగడ్డలో ఆడుతున్న...
సెమీ ఫైనల్స్ కు చేరినంత మాత్రాన సరిపోదు. సొంతగడ్డలో ఆడుతున్న టీం ఇండియాకు అనేక అంశాలు కలసి వస్తున్నాయి కనుక ఫైనల్స్ లోనూ సత్తా చాటి కప్పును ఇండియా ఖాతాలో చేర్చాలని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు. మిగిలిన జట్లకు ఆ అవకాశం లేదు కాబట్టి ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదని కోరుకుంటున్నారు. రోహిత్ సేన కూడా అలాంటి ప్రయత్నమే చేస్తుంది. ఇప్పుడున్న టీంపై క్రికెట్ ఫ్యాన్స్ లో నమ్మకం పెరిగిపోయింది. కప్పు మనదేనన్న ధీమా మరింత పెంచేలా టీం ఇండియా ఆడుతున్న తీరు ఉంది. అందుకే వరల్డ్ కప్ లో టీం ఇండియాకు ఎదురులేదు. తిరుగులేదు.
Next Story