Fri Dec 20 2024 18:59:13 GMT+0000 (Coordinated Universal Time)
T20 World Cup 2024 : చెమటలు కక్కినా సరే.. విక్టరీ కొట్టాల్సిందే.. టీం ఇండియాపై పెరుగుతున్న వత్తిడి
ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్ ఆదివారం న్యూ యార్క్ లో జరుగుతుంది. రెండుజట్లపై వత్తిడి అధికంగా ఉంది
ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్ అంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ప్రతి బంతికీ బీపీ పెరుగుతుంటుంది. తగ్గుతుంటుంది. ఒక ఫోర్ కొడితే ఆనందం... అదే అవతలి వారు ఫోర్ కొడితే ముఖంలో అనుకోకుండానే మార్పులు. ఉద్విగ్న భరితమైన మ్యాచ్ ఎప్పుడైనా ఎక్కడైనా జరుగుతుంది అంటే అది భారత్ - పాక్ మ్యాచ్ మాత్రమే. ఎందుకంటే పేరుకు దాయాది దేశమైనా శత్రువులకన్నా ఎక్కువగా చూడటమే. ఎందుకో .. ఈ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఇరుజట్లలోని ఆటగాళ్ల కసి కూడా అలాగే కనపడుతుంది. గెలిస్తే కేరింతలు.. ఓడితే నిరాశ.. ఇలా అన్ని ఎక్స్ప్రెషన్స్ పలికించేది ఒక్క భారత్ - పాక్ మ్యాచ్ లోనే. రెండు దేశాల్లో తమ జట్టు ఓడిపోతే టీవీలు పగుల కొట్టిన సందర్భాలు అనేకం. అనేక గుండెలు ఆగిపోయాయి.
భారత్ మాత్రం...
ఆదివారం ఈ మ్యాచ్ జరగనుంది. న్యూ యార్క్ లోని నాసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఐర్లాండ్ మీద భారత్ సునాయాసంగా గెలిచింది. అయితే ఐర్లాండ్ చిన్న దేశం. దాని మీద గెలవడం పెద్ద గొప్పకాదు. ఆ మ్యాచ్ లో విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ వంటి బ్యాటర్లు విఫలమయ్యారు. అయితే బౌలర్లు విజృంభించడంతోనే ఐర్లాండ్ మీద మ్యాచ్ ను సులువుగా గెలవగలిగాం. ఎలాంటి సంచలనాలు నమోదు కాకుండా భారత్ - ఐర్లాండ్ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. రోహిత్ శర్మ ఈ వరల్డ్ కప్ లో తొలి అర్ధ సెంచరీ చేసి తాను ఫామ్ లో ఉన్నానని చెప్పకనే చెప్పగలిగాడు.
పాక్ ఇలా...
ఇక పాకిస్థాన్ పరంగా చూస్తే ఆ జట్టు అమెరికాతో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలయింది. అసలు సూపర్ ఓవర్ వరకూ రావడమే అమెరికా విజయం సాధించినట్లని క్రీడాపండితులు చెబుతున్నారు. అంచనాలు లేని టీం అమెరికాతో ఓటమిపాలయిన పాకిస్థాన్ కసితో రగిలిపోతుంది. భారత్ తో మ్యాచ్ గెలిచి తమలోని పస తగ్గలేదని నిరూపించుకోవాలని తహతహలాడుతుంది. అయితే ఇరు జట్లు మైదానంలో దిగితే వాళ్లకే కాదు.. చూసేవాళ్లకు కూడా టెన్షన్ తప్పదు. చెమటలు పడతాయి. అందుకే ఆదివారం ఈ మ్యాచ్ పెట్టారు. ఎక్కువ మంది వీక్షించేందుకు అనువుగా ఈ మ్యాచ్ డేట్ ను ఫిక్స్ చేశారు. అందుకే ఈ మ్యాచ్ పట్ల అంచనాలు మాత్రం అధికంగానే ఉన్నాయి. ఇరుజట్ల ఆటగాళ్లపై వత్తిడి కూడా అధికంగానే ఉంది.
Next Story