Mon Dec 23 2024 09:53:33 GMT+0000 (Coordinated Universal Time)
World Cup Finals 2023 : సమర్పించుకున్నట్లేనా.. రన్ రేటు తక్కువ.. బౌలర్లపైనే ఇక భారమంతా
అందరి అంచనాలకు భిన్నంగా ఆట మొదలయింది. టీం ఇండియా బ్యాటర్లు చేతులెత్తేశారు
అందరి అంచనాలకు భిన్నంగా ఆట మొదలయింది. టీం ఇండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. వరస పెట్టి అవుట్లవుతూ ఆస్ట్రేలియా బౌలర్ల చేతికి చిక్కుతున్నారు. ఐదు వికెట్లు కోల్పోయిన టీం ఇండియా కష్టాల్లోనే ఉందని చెప్పాలి. ఇండియా - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసిస్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ, శుభమన్ గిల్ లు కొంత దూకుడుతో ఆడారు. రోహిత్ తన ఫామ్ లోనే ఆటను కొనసాగించాడు.
మరోసారి రోహిత్...
ఆ తర్వాత శుభమన్ గిల్ పెద్దగా పరుగులు చేయకుండానే అవుట్ అయ్యాడు. దీంతో విరాట్ కోహ్లి క్రీజులోకి వచ్చాడు. విరాట్, రోహిత్ లు కొంత నెమ్మదిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. అయితే రోహిత్ శర్మ ఎప్పటిలాగానే 47 పరుగులు చేసి వికెట్ సమర్పించుకున్నాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ డకౌట్ తో వెనుదిరిగాడు. ఇక విరాట్ కోహ్లి తన అర్థసెంచరీని పూర్తి చేసుకున్నాడు. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ కలసి చక్కదిద్దుతారనుకునే సమయంలో విరాట్ కోహ్లి అవుట్ కావడంతో ఇండియన్ ఫ్యాన్స్ లో కలవరం మొదలయింది.
కోహ్లి, కేఎల్ రాహుల్ అర్థ సెంచరీ...
అనంతరం క్రీజులోకి వచ్చిన జడేజా పెద్దగా పరుగులు చేయకుండానే అవుట్ కావడంతో భారత్ భారీ స్కోరు చేసే అవకాశాలు కన్పించడం లేదు. కేఎల్ రాహుల్ తన అర్థ సెంచరీని పూర్తి చేసుకుని నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లు క్రీజులో ఉన్నారు. 40 ఓవర్లకు టీం ఇండియా స్కోరు197 దాటలేదు. మరో పది ఓవర్లే మిగిలి ఉండటంతో భారత్ భారీ స్కోరు చేసే అవకాశాలు కన్పించడం లేదు. ఈ మైదానంలో అత్యధిక స్కోరు 289. కనీసం 250 పరుగులు చేస్తారా? అన్న అనుమానం ఫ్యాన్స్ లో బయలుదేరింది. మరి చూడాలి ఏం జరుగుతుందో.
Next Story