Fri Dec 20 2024 14:06:17 GMT+0000 (Coordinated Universal Time)
కుదురుకున్నారంటే చాలు.. కుమ్మేసినట్లేగా
వరల్డ్ కప్లో భారత్ తిరుగులేకుండా ముందుకు వెళుతుంది. వరసగా నాలుగు విజయాలతో దూసుకెళుతుంది
వరల్డ్ కప్లో భారత్ తిరుగులేకుండా ముందుకు వెళుతుంది. వరసగా నాలుగు విజయాలతో దూసుకెళుతుంది. భారత్ ను ఆపే శక్తి ఏ టీంకు లేదనేలా ఆటగాళ్లు తమ ప్రతిభను కనబరుస్తున్నారు. ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్లపై విజయం సాధించింది. నాలుగు జట్లు చిన్నవేమీ కాదు. ఏ జట్టుకు ఆ జట్టుకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. మైదానంలో కదలికలను బట్టి ఏ జట్టయినా గెలిచే అవకాశాలు పుష్కలం అనేది క్రికెట్ చరిత్ర తెలిసిన వారికి ఎవరికైనా తెలిసే నిజం. అందుకే ప్రతి విజయమూ భారత్ ఆటగాళ్ల ప్రతిభకు నిదర్శనంగానే పేర్కొనాలి.
సమిష్టి విజయంతో...
ఇది ఒక్కరి ఆట కాదు.. సమిష్టి విజయం అనాల్సిందే. ప్రతి బ్యాట్స్మెన్ బాగా ఆడారు. బౌలర్లు కూడా అంతే రీతిలో తమ బౌలింగ్ కు పదును పెట్టారు. అందుకనే ఇంతటి విజయాలు సాధ్యమయ్యాయి. నాలుగు సార్లు గెలిచిన టీం ఇండియా ఫైనల్ కు చేరడం ఖాయమన్నది క్రీడా విశ్లేషకుల అంచనాగా ఉంది. అందరూ ఫామ్ లో ఉండటం టీం ఇండియాకు కలసి వచ్చే అంశం. ఓపెనర్లుగా శుభమన్ గిల్, రోహిత్ శర్మ పది ఓవర్లు నిలదొక్కుకుంటే చాలు స్కోరు బోర్డు పరుగులు తీస్తుంది. వారిద్దరూ వందకు పైగానే భాగస్వామ్యం చేయగల సత్తా ఉన్నోళ్లు. వారిద్దరూ ఫుల్లు ఫాంలో ఉండటం టీం ఇండియాకు కలసి వస్తుంది.
విరాట్ వీరవిహారంతో...
ఇక ప్రత్యర్థి ఎవరైనా సరే.. విరాట్ కొహ్లి ముందు తక్కువే. కుదురుకుంటే చాలు కుమ్మేసినట్లే. ఇక విరాట్ బ్యాట్ తో మైదానంలోకి వస్తున్నాడంటే ఫ్యాన్స్కి పూనకాలే. అంతటి అభిమానమున్న విరాట్ మంచి ఊపు మీదున్నాడు. చాలా రోజుల తర్వాత ఎంట్రీ ఇచ్చిర కేఎల్ రాహుల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సొగసైన షాట్లతో అలరిస్తాడు. అలాగని ఫోర్లు, సిక్సర్లు కొట్టడని కాదు. బాల్ అందివస్తే చాలు బౌండరీ లైన్ దాటాల్సిందే. కేఎల్ రాహుల్ సైన్యంలో ఒక ముఖ్యమైన ఆయుధంగానే చూడాలి. ఇక హార్ధిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, జడేజా వరకూ ఎవరినీ తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. పటిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉంది.
సండే మంచి ఫీస్ట్...
అందుకే భారత్ ఎంతటి టార్గెట్ అయినా సులువుగా ఛేదిస్తుందన్న నమ్మకం అభిమానుల్లో ఉంది. వరల్డ్ కప్ కు ముందు కొంత అటు ఇటుగా ఉన్న ఆటగాళ్లు ఫుల్లు ఫామ్ లోకి రావడంతోనే భారత్ విజయయాత్ర కొనసాగిస్తూంది. ఈ ఆదివారం జరిగే మ్యాచ్ కీలకం. నాలుగు మ్యాచ్లను గెలిచిన న్యూజిలాండ్ కూడా మంచి ఊపు మీద ఉంది. న్యూజిలాండ్ ను మట్టికరిపించగలిగితే ఇక వరల్డ్ కప్లో భారత్ కు తిరుగులేనట్లే. రెండు జట్లకు ఆ మ్యాచ్ కీలకంగానే చూడాలి. ఇరు జట్లు బలంగానే ఉండటంతో గెలుపోటములపై అప్పుడే చర్చ మొదలయింది. సో.. సండే రోజుకూడా ఫ్యాన్స్ కు మంచి ఫీస్ట్ ఇస్తూ ఐదో విక్టరీని టీం ఇండియా కొట్టాలని ఆశిద్దాం.
Next Story