Fri Nov 22 2024 18:43:37 GMT+0000 (Coordinated Universal Time)
World Cup 2023 : ఈరోజు...ఎన్ని రికార్డులు బద్దలవుతాయో.. గేమ్ లాంఛనమే కాని?
టీం ఇండియా తన ఆఖరిలీగ్ మ్యాచ్ ను నేడు నెదర్లాండ్స్తో ఆడబోతుంది. బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది
దీపావళి పండగ రోజు.. అదే సమయంలో ఈరోజు క్రికెట్ ఫ్యాన్స్ కు కూడా పసందైన రోజు. టీం ఇండియా తన ఆఖరిలీగ్ మ్యాచ్ ను నేడు నెదర్లాండ్స్తో ఆడబోతుంది. బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటికే సెమీ ఫైనల్స్ కు చేరిన టీం ఇండియా కేవలం రికార్డుల కోసమే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ ఆడటం లాంఛనప్రాయమే అయినప్పటకీ వరల్డ్కప్ లో అన్ని మ్యాచ్ లు గెలిచి సెమీ ఫైనల్స్ కు చేరుకున్న జట్టుగా భారత్ రికార్డు నమోదు చేయబోతుంది.
వరస గెలుపులతో...
పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న టీం ఇండియా బ్యాటింగ్, బౌలింగ్ పరంగా బలంగానే ఉంది. అందులోనూ తమకు అచ్చొచ్చిన బెంగళూరు వేదికలో మొదట బ్యాటింగ్ చేస్తే మూడు వందలకు పైగానే పరుగులు చేసి నెదర్లాండ్స్ పై వత్తిడి పెంచాల్సి ఉంటుంది. రోహిత్ సేన ఇప్పటికే సెమీ ఫైనల్ చేరుకోవడంతో ఈ మ్యాచ్ పై ఫ్యాన్స్ కు విక్టరీ కాదు రికార్డుల కోసమే చూస్తున్నారు. ఎవరు ఎక్కువ పరుగులు చేస్తారన్నది ముఖ్యం. అలాగే బౌలర్ల విషయంలోనూ రికార్డులు దరిదాపుల్లోనే ఉన్నాయి.
బలంగా భారత్...
బ్యాటింగ్ పరంగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఓపెనర్లుగా దిగితే షాట్ల మీద షాట్లు. బాదితే బంతి బౌండరీకే. కొడితే సిక్సర్ కాక ఏముంటుంది? అలాగే విరాట్ కొహ్లి కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. విరాట్ సొగసైన షాట్ల కోసం అభిమానులు కన్నులు కాచేలా చూస్తున్నారు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ రన్ రేట్ ను పరుగులు పెట్టించడంలో దిట్ట. కేఎల్ రాహుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాహుల్ ఉంటే చాలు.. స్కోరుకు స్కోరు... గెలుపుకు.. గెలుపుకు అనే ధీమా.. తర్వాత సూర్యకుమార్ యాదవ్.. జడేజాలు కూడా అంతే. చివరలో వచ్చి వీర బాదుడు బాది టీం ఇండియాను గట్టెక్కించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
బ్యాటర్లు కూడా...
బౌలర్ల పరంగా కూడా భారత్ బలంగా ఉంది. పేసర్లు సిరాస్, బుమ్రా, షమీలు వికెట్ తీయకుండా వెనుదిరగడం లేదు. ముగ్గురు ప్రత్యర్థులను భయపెడుతున్నారు. ఇక స్పిన్నర్లు జడేజా, కులదీప్ యాదవ్ లు తమ స్పిన్ మాయాజాలంతో వికెట్లు ఎలా పడిపోయాయన్నది గుర్తించేలోపు ప్రత్యర్థి బ్యాటర్ పెవిలియన్ దారి పడుతున్నారు. మలుపులు తిరుగుతూ వచ్చే బంతి ఎటు వైపు వెళుతుందో ఎవరికీ అర్థంకాకుండా ఉంది. అయితే ఈ మ్యాచ్ లాంఛనమే అయినా నెదర్లాండ్స్ ను కూడా తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. చిన్న జట్టుగా వచ్చి బాగానే పెర్ఫార్మ్ చేసింది. మరి ఈరోజు బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో ఎన్ని రికార్డులు బద్దలవుతాయన్నది చూడాల్సి ఉంది.
Next Story