Mon Nov 18 2024 00:42:44 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ముగ్గురినీ కట్టడి చేయగలిగితేనే?
మరికాసేపట్లో ఇండియా - బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
మరికాసేపట్లో ఇండియా - బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. పూనే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బంగ్లాదేశ్ మీద గెలిచి సెమీస్‌కు వెళ్లేందుకు మార్గం మరింత సుగమం చేసుకోవాలని ప్రతి క్రికెట్ అభిమాని కోరుకుంటున్నారు. అలాగని బంగ్లాదేశ్ ను తక్కువగా అంచనా వేయలేం. మైదానంలో ఆ జట్టు ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. భారత్ అంచనాలన్నీ తలకిందులు చేయాలని బంగ్లాదేశ్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది. భారత్‌ను ఓడించి తామేంటో నిరూపించుకోవాలని బంగ్లాదేశ్ జట్టు తహతహలాడుతుండటం సహజమే. దానిని ఎవరూ కాదనలేరు.
చెలరేగి ఆడితే...
కానీ అదే సమయంలో భారత్ కూడా ఆ ముగ్గురికీ భయపడకుండా ఉండలేకపోతుంది. క్రికెట్ తెలిసిన వారెవరైనా ఆ ముగ్గురినీ కంట్రోల్ చేయగలిగితే మనకు విజయం ఖాయమని నమ్ముతున్నారు. బంగ్లాదేశ్‌లో ప్రమాదకరమైన ఆటగాళ్లుగా ఉన్నారు. అందులోనూ భారత్‌తో ఆడేటప్పుడు వీరు చెలరేగి ఆడటం అలవాాటుగా మారింది. అలాంటి వారితో డేంజర్ అని గత మ్యాచ్‌లు జరిగిన తీరు చెప్పకనే చెబుతున్నాయి. అందుకే భారత్ జట్టు ఆ ముగ్గురి విషయంలో ఒకింత జాగ్రత్తగా ఉండాలన్న హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. వారు చెలరేగిపోతే మాత్రం భారత్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమవుతుందని కూడా చాలా మంది అభిప్రాయం.
గత రికార్డులను పరిశీలిస్తే...
బంగ్లాదేశ్ ఆటగాళ్లు షకీబుల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్, లిటన్ దాస్ లు భారత్ ను ఒకింత భయపెడుతున్న మాట వాస్తవమే. వీరి ముగ్గురికి గతంలో భారత్‌పై ఆడినప్పుడు మంచి రికార్డులున్నాయి. సులువుగా తమ వైపు మ్యాచ్ ను మలుచుకోగలరు. గత ఏడాది జరిగిన మ్యాచ్‌లో మిరాజ్ సెంచరీ చేసిన సంగతిని ఇంకా టీం ఇండియా మర్చిపోయి ఉండదు. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. షకీబుల్ హసన్ కూడా బ్యాటర్ గా, బౌలర్ గా రాణిస్తాడు. లిటన్ దాస్ దూకుడుకు కళ్లెం వేయకపోతే ఇక కష్టమే మరి. వీలయినంత త్వరగా అవుట్ చేయకపోతే భారత్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు. ఇలా ఈ ముగ్గురు బంగ్లా ఆటగాళ్లు భారత్ విజయానికి అడ్డుకట్ట వేసేందుకు చేసే ప్రయత్నాలు ఫలించ కూడదని మనమందరం కోరుకుందాం.
Next Story