Sun Nov 17 2024 18:32:26 GMT+0000 (Coordinated Universal Time)
T20 World Cup 2024 : ఇప్పటిదాకా అయితే ఒకే.. ఈరోజు నుంచి మాత్రం ప్రతి మ్యాచ్ మెన్ ఇన్ బ్లూ కు కీలకమే
టీ 20 వరల్డ్ కప్ లో మెన్ ఇన్ బ్లూ నేడు ఆప్ఘనిస్థాన్ తో తలపడుతుంది. సూపర్ 8 మ్యాచ్ లలో ఇది తొలి మ్యాచ్
టీ 20 వరల్డ్ కప్ లో మెన్ ఇన్ బ్లూ నేడు ఆప్ఘనిస్థాన్ తో తలపడుతుంది. సూపర్ 8 మ్యాచ్ లలో ఇది తొలి మ్యాచ్. సూపర్ 8 లో ఆప్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లతో తలపడనుంది. ఈ మూడు మ్యాచ్ లు ఇండియాకు కీలకమే. ఏ మ్యాచ్ లోనూ నిర్లక్ష్యం చేసినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ న్యూ యార్క్ లో వరసగా మూడు మ్యాచ్ లు గెలిచి మంచి ఊపుమీద భారత్ జట్టు ఉంది. పాకిస్థాన్, అమెరికా, ఐర్లాండ్ దేశాలను ఓడించి సులువుగానే సూపర్ 8కు చేరుకుంది. అయితే ఈ విజయాలు కూడా అంత సులువుగా దక్కలేదు. శ్రమించాల్సి వచ్చింది. స్వేదం చిందించాల్సి వచ్చింది. చూసే వారికి టెన్షన్ పడక తప్పలేదు.
బ్యాటర్లు ఝుళిపించాల్సిందే...
న్యూయార్క్ లో జరిగిన మ్యాచ్ లలో టీం ఇండియాలో భారత్ బ్యాటర్లు పెద్దగా రాణించలేదనే చెప్పాలి. అంచనాకు తగినట్లు ఆడలేదు. విరాట్ కోహ్లి మూడు మ్యాచ్ లలోనూ నిరాశపర్చాడు. చూసేందుకు చిన్న జట్లు అనిపించినా వెంటనే అవుటయి విరాట్ ఇదేమీ ఆట బాసూ అన్న తరహాలో అందరూ విస్తుపోయాలా ఆట ఆటాడు. ఇక రోహిత్ శర్మ తొలి మ్యాచ్ ఐర్లాండ్ పై హాఫ సెంచరీ చేసినా, తర్వాత మ్యాచ్ లలో పెద్దగా రాణించలేదు. సూర్యకుమార్ యాదవ్ కూడా రెండు మ్యాచ్ లలోనే రాణించాడు. శివమ్ దూబే కూడా నిరాశపరిచాడు. అందరిలో కొద్దో గొప్పో రిషబ్ పంత్ నిలకడగా ఆడుతూ భారత్ విజయాలకు ఆ మ్యాచ్ లలో కారణంగా నిలిచాడన్నది అందరూ ఒప్పుకోవాల్సిందే.
బౌలర్లు రాణిస్తేనే...
ఇక బౌలర్లు మాత్రం బాగా రాణించారు. వాళ్లు త్వరత్వరగా వికెట్లు అందిపుచ్చుకోవడం వల్లనే మూడు మ్యాచ్ లలో విజయం సాధ్యమయింది. అందుకే జరగబోయే మ్యాచ్ లలో క్రికెట్ ఫ్యాన్స్ మన బ్యాటర్ల పైన కంటే బౌలర్లపైనే ఎక్కువ ఆశ పెట్టుకున్నారు. నేడు బ్రిడ్జి టౌన్ లో జరిగే మ్యాచ్ లో మళ్లీ బౌలర్లదే ఆధిపత్యం కొనసాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ పిచ్ కూడా పేసర్లకు అనుకూలమైనదని చెబుతున్నారు. ఆరంభంలో పేసర్లు, తర్వాత స్పిన్నర్లకు పిచ్ అనుకూలంగా మారుతుందని క్రీడా నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు భారీ స్కోరు నమోదయిన పిచ్ కూడా ఇదే కావడం గమనార్హం.
వత్తిడి లేకుండా...
ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన బౌలర్లు రాణించాల్సి ఉంటుంది. అర్షదీప్ సింగ్, సిరాజ్, హార్ధిక్ పాండ్యాలు వేగంగా వికెట్లు తీయగలిగితే మనకు ఇక దిగులుండదు. అదే సమయంలో అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్ ను తీసుకుంటే అతను కూడా రాణిస్తే మన బౌలింగ్ పటిష్టంగా ఉంటుందన్న అంచనాలు వినపడుతున్నాయి. అయితే మొదట ఇండియా బ్యాటింగ్ చేస్తే మాత్రం బౌలర్లపై వత్తిడి పెంచేలా మన బ్యాటర్లు స్కోరు చేయకూడదు. వీలయినంత ఎక్కువ స్కోరు చేయగలిగితేనే మన బౌలర్ల చేతిలో బంతి సులువుగా తిరుగుతుంది. లేకుంటే బంతి తడబడి ప్రత్యర్థి జట్టుకు వరంగా మారుతుందన్న లెక్కలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ రోజు జరిగే మ్యాచ్ లో ఎక్కువ మంది విశ్లేషకులు టీం ఇండియా వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ ఆప్ఘనిస్థాన్ ను అంత తేలిగ్గా అంచనా వేయకూడదు.
Next Story