Fri Dec 20 2024 22:14:33 GMT+0000 (Coordinated Universal Time)
World cup 2023 : మైదానమంతా తిరిగి కప్పు గెలిచినంత సంబారాలు.. తప్పేంటి?
వరల్డ్ కప్లో వరసగా ఇంతటి సంచలన విజయాలు నమోదవుతాయని ఎవరూ ఊహించలేదు
వరల్డ్ కప్లో వరసగా ఇంతటి సంచలన విజయాలు నమోదవుతాయని ఎవరూ ఊహించలేదు. రేపు సెమీ ఫైనల్స్ కు కూడా క్రీడా విశ్లేషకులకు సయితం అందని జట్లే వచ్చే అవకాశముందనిపిస్తుంది. పది జట్లు ఏదీ బలహీనమైనది కాదు. అన్నీ సమర్థంగా ఆడే జట్లే. కాకుంటే మైదానంలో ఆరోజు ఎవరికి కలసిసొస్తే వారిదే పై చేయి అవుతుంది. చిన్న జట్లని ఏ మాత్రం ఉపేక్షించినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ వరల్డ్ కప్లో ఇప్పటికే కొన్ని మ్యాచ్లు రుజువు చేశాయి. రానున్న కాలంలో మరిన్ని ఉత్కంఠ భరితమైన మ్యాచ్లు చూడాల్సి వస్తుంది. టీ 20లు వచ్చిన తర్వాత వన్డేలు చూసే వారి తగ్గుతుందని భావించే వారికి ఈ వరల్డ్ కప్ బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి.
సంబరాలు చేసుకుని...
నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోతుందని ఎవరైనా ఊహించారా? అలాగే ఆప్ఘనిస్థాన్ జట్టు ఇంగ్లండ్ పై గెలిచినప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ వీక్ అయిందని కామెంట్స్ చేసిన వారు నిన్నటి పాక్ తో జరిగిన మ్యాచ్ చూసి నోరెళ్ల పెట్టారు. 283 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించడం అంటే ఆషామాషీ కాదు. ఆప్ఘనిస్థాన్ బ్యాటర్లను మెచ్చుకోకుండా ఉండలేం. క్రీజులో నిలబడి తమ కోరిక నెరవేర్చుకున్నారు. అందుకే పాక్ తో విజయం సాధించిన తర్వాత వరల్డ్ కప్ తమకే దక్కినట్లు మైదానమంతా తిరిగి సంబరాలు చేసుకున్నారు. అందులో ఏమాత్రం తప్పులేదు. ఇకపై ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు ఎంత మాత్రమూ ఆఫ్టరాల్ జట్టు కాదు, క్రికెట్లో పసికూన కానే కాదు. ప్రపంచ మేటి జట్లలో ఒకటి.
ఏ జట్టునూ...
అందుకే పది జట్లు కూడా ఏదీ తక్కువ జట్లని తీసిపారేయడం సరికాదు. చివరి వరకూ ఎవరిది విజయం అన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితి. కొన్ని మ్యాచ్లలో తప్పించి చివర వరకూ విజయం దోబూచులాడుతూనే ఉంది. టీ 20లలో మాదిరిగా ఆఖరి ఓవర్ వరకూ ఎవరిదో గెలుపు అన్న ఉత్కంఠ చూసేవారిలో ఉంటుంది. అందుకే ఈ వరల్డ్ కప్ సూపర్ సక్సెస్ అయిందనే చెప్పాలి. నిన్న చెన్నైలో జరిగిన ఆప్ఘనిస్తాన్, పాకిస్థాన్ మ్యాచ్ కు కూడా స్టేడియం అంతా ఇరు దేశాల అభిమానులతో నిండిపోవడం ఇందుకు ఉదాహరణగా చూడాలి. పాపం పాకిస్థాన్.. ఎంతో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగి ఉంటుంది. కానీ చివరకు విజయం ఆప్ఘనిస్తాన్ పరం కావడంతో ఆ టీం కొంత నిరాశలో మునిగిపోయిందనే చెప్పాలి.
పుంజుకోగలిగితే...
పాకిస్థాన్ కు టైం బాగా లేదని చెప్పే వాళ్లకు గుణపాఠం చెప్పాలంటే వరసగా మరో నాలుగు మ్యాచ్లు గెలిచి సెమీస్ కు చేరాల్సి ఉంటుంది. అందుకు సమిష్టి కృషి అవసరం. జట్టులో అనైక్యత స్పష్టంగా కనిపిస్తుంది. సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ఈ తప్పొప్పులను సరిదిద్దుకుంటే పాకిస్థాన్ కు సెమీస్ చేరుకోవం పెద్ద కష్టమేమీ కాదు. అలా అని ఇక ఏ జట్టును సులువుగా అంచనా వేసి బరిలోకి దిగడం కూడా చేయకూడదు. వరల్డ్ కప్ లో ఆప్ఘనిస్థాన్, నెదర్లాండ్స్ వంటి దేశాలకు విజయం అవసరం. ఎప్పుడూ అగ్రశ్రేణి జట్లు కాకుండా అప్పుడప్పుడు ఇలా చిన్న జట్లు కూడా సంచలనాలు నమోదు చేస్తే క్రికెట్ కు ప్రపంచ వ్యాప్తంగా మరింత క్రేజ్ పెరగడం ఖాయం. అందుకే చిన్న జట్లు ఏమీ లేవన్నది మరోసారి రుజువైంది.
Next Story