Mon Dec 23 2024 03:45:57 GMT+0000 (Coordinated Universal Time)
T20 World Cup : ఈ ఇద్దరిలో అదృష్టం ఒకరికి.. దురదృష్టం మరొకరికి.. విధి రాత అంటే ఇదేనేమో?
టీ 20 వరల్డ్ కప్ లో ఆడటం అనేది ప్రతి క్రికెటర్ కు ఒక కల. అది నెరవేరిన వెళ అంతకంటే ఆనందం మరొకటి ఉండదు
టీ 20 వరల్డ్ కప్ లో ఆడటం అనేది ప్రతి క్రికెటర్ కు ఒక కల. అది నెరవేరిన వెళ అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. అందులోనూ వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉండటం అంటే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. ప్రతి ఆటగాడు తమ క్రికెట్ జీవితంలో వరల్డ్ కప్ ఆడి కప్పును ముద్దాడాలని కోరుకుంటారు. అది తమ జీవితంలోనే చిరస్మరణీయమైన రోజుగా భావిస్తారు. ఎందుకంటే కొందరికే అటువంటి అరుదైన అవకాశం లభిస్తుంది. మరికొందరికి మాత్రం లభించదు. ఎంత ఫామ్ లో ఉన్న ఆటగాళ్లకయినా ఒక్కోసారి వరల్డ్ కప్ కు ఎంపిక కాలేక ఇబ్బంది పడుతూ ఆవేదన పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఆనందం... నిరాశ...
ఈ వరల్డ్ కప్ ఇద్దరి ఆటగాళ్లకు మాత్రం వేర్వేరు రకాలైన అనుభూతులను పంచింది. ఒకరికి ఆనందం ఇవ్వగా, మరొకరికి నిరాశను మిగిల్చింది. అయితే ఇది సాధారణమే అయినా వరల్డ్ కప్ టీఇండియా సొంతం చేసుకోవడం వల్లనే ఈ చర్చ నడుస్తుంది. కప్పు రాకపోతే అసలు ఆ ప్రస్తావనే ఉండదనుకోండి. ఇంతకీ ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరయ్యా అంటే.. ఒకరు రిషబ్ పంత్ కాగా... మరొకు కె.ఎల్ రాహుల్. ఇద్దరూ మేటి ఆటగాళ్లే. ఇద్దరూ ఫామ్ లో ఉన్నవాళ్లే. అదృష్టం తలుపు తట్టాల్సిన కెఎల్ రాహుల్ ను దురదృష్టం వెంటాడగా, అసలు ఎంపికవుతాడా? అన్న అనుమానాల మధ్య రిషబ్ పంత్ వరల్డ్ కప్ జట్టులో స్థానం సంపాదించుకుని విజేతల జట్టులో సభ్యుడిగా నిలిచాడు.
రోడ్డు ప్రమాదానికి గురై...
రిషబ్ పంత్ విషయానికి వస్తే 2022 లో రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఉత్తరాంఖండ్ నుంచి ఢిల్లీ వస్తుండగా కారు డివైడర్ ఢీకొట్టి కారుమొత్తం కాలి బూడిదయింది. కారులో నుంచి మంటలు కూడా వచ్చాయి. అసలు బతకడమే గొప్ప. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన రిషబ్ పంత్ వెంటనే ఆసుపత్రిలో చేరారు. దాదాపు ఏడాది పాటు అన్ని ఫార్మాట్లలోని క్రికెట్ కు దూరమయ్యాడు. కాలు తుంటి ఎముక విరగడంతో ఇక రిషబ్ పంత్ పని అయిపోయినట్లే.. క్రికెట్ కెరీర్ ముగిసినట్లేనని భావించారంతా. కానీ ఏడాది తిరక్కముందే కోలుకున్నాడు. ఐపీఎల్ లో మళ్లీ ప్రత్యక్ష మయ్యాడు. దూకుడు ప్రదర్శించాడు. ఢిల్లీ కాపిటల్స్ కెప్టెన్ గా వ్యవహరించి జట్టు విజయాల్లో కీలకభ భూమిక పోషించాడు. అంతే టీ20 వరల్డ్ కప్ కు ఎంపికయ్యాడు. కప్ ఇండియా సొంతం కావడంతో జట్టు సభ్యుడిగా ఉన్నారు.
అత్యంత దురదృష్టవంతుడు...
కెఎల్ రాహుల్ విషయానికి వస్తే అత్యంత దురదృష్టవంతుడు అనే చెప్పుకోవాలి. కూల్ గా ఆడుతూ బాగా రాణించడంతో పాటు అవసరమైన సమయంలో పరుగులు తెచ్చి పెట్టే ఆటగాడిగా పేరుంది. ఐపీఎల్ లోనూ తన జట్టును ముందుండి నడిపించాడు. జట్టు గెలవకపోయినా వ్యక్తిగతంగా అద్భుతమైన ప్రదర్శన చేశాడు కెఎల్ రాహుల్. టీ 20 వరల్డ్ కప్ లో వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా పనికి వస్తాడని భావించి రాహుల్ ను ఎంపిక చేస్తారనుకున్నారంతా. అయితే అనూహ్యంగా వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా రిషబ్ పంత్ ఎన్నిక కావడంతో రాహుల్ ను సెలెక్టర్లు పక్కన పెట్టారు. కప్ గెలిచిన జట్టులో కెఎల్ రాహుల్ సభ్యుడిగా లేడు. రిషబ్ పంత్ కు అదృష్టం కలసి రాగా, కెఎల్ రాహుల్ కు దురదృష్టం వెంటాడింది. ఇద్దరిలో ఎవరికి ఎవరూ తీసిపోరు. కానీ ఒకరికే లక్ దొరుకుతుందనడానికి రిషబ్ పంత్ ఉదాహరణగా చెప్పుకోవాలి.
Next Story