Sun Nov 17 2024 18:31:47 GMT+0000 (Coordinated Universal Time)
T20 World Cup : ఇదేందయ్యా... ఇట్లా జరిగిందే.. ఛాంపియన్స్ కు చిత్తుగా ఓడించారుగా.. ఒకరకంగా వరల్డ్ కప్ గెలిచినట్లేగా
టీ 20 వరల్డ్ కప్ లో సంచలనం నమోదయింది. ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాను ఆప్ఘనిస్థాన్ ఓడించింది
టీ 20 వరల్డ్ కప్ లో సంచలనం నమోదయింది. ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాను ఆప్ఘనిస్థాన్ ఓడించింది. ఊహించని ఈ విజయంతో వరల్డ్ కప్ లో మరే సంచలనాలు నమోదవుతాయన్న ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. అవును... ఎవరూ ఊహించలేదు. ప్రపంచంలోనే మేటి జట్టుగా పేరున్న ఆస్ట్రేలియాను ఓడించింది పసికూన ఆప్ఘనిస్థాన్. ఈ గెలుపుతో ఆప్ఘనిస్థాన్ సెమీస్ లో ఆశలను సజీవంగా నిలుపుకున్నట్లయింది. ఇది చూసిన వారు చిన్న జట్లని ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యంచెల్లించుకోక తప్పదని అన్ని టీంలకు హెచ్చరిక పంపినట్లయింది.
న్యూజిలాండ్ ను ఓడించి...
ఆప్ఘనిస్థాన్ గ్రూప్ స్టేజీలోనే న్యూజిలాండ్ ను ఓడించింది. అప్పుడే ఇది నిజమేనా అని అనుకున్నారు. కానీ మరోసారి ఆస్ట్రేలియాను కూడా ఓడించడంతో ఆప్ఘనిస్థాన్ జట్టు ప్రపంచకప్ లోనే హాట్ ఫేవరెట్స్ లో ఒకటిగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. ఆస్ట్రేలియాపై 21 పరుగుల తేడాతో ఆప్ఘనిస్థాన్ విజయం సాధించి తొలిసారి ఆ దేశంపై గెలిచి తన సత్తా చాటినట్లయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ జట్టు ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 148 పరుగులు మాత్రమే చేసింది. ఆప్ఘాన్ జట్టులో గుర్బాజ్ అరవై పరుగులు, ఇబ్రహీం జద్రాన్ యాభై ఒక్క పరుగులు చేశారు. నిజానికి ఆస్ట్రేలియా ముందు ఈ స్కోరు స్వల్ప లక్ష్యమే.
ఛేదనలో చిత్తయి...
ఛేదనలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆది నుంచి కొంత ఇబ్బందిపడుతూనే వచ్చింది. గుల్బాదిన్ నైబ్ నాలుగు ఓవర్లు వేసి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. నైబ్ వల్లనే ఈ విజయం ఆప్ఘనిస్థాన్ కు సాధ్యమయింది. నవీనుల్ హక్ మూడు, నబీ ఒకటి, రషీద్ ఖాన్ ఒక వికెట్ తీసి ఆస్ట్రేలియా బ్యాటర్లను పెవిలెయన్ కు పంపారు. ఆస్ట్రేలియాలోని మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో ఇరవై పరుగులకు 127 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో భారత్ ఇప్పటికే సెమీస్ బెర్త్ ను దాదాపుగా ఖరారు చేసుకోగా, ఆస్ట్రేలియా, ఆప్ఘనిస్థాన్ సెమీస్ లో బెర్త్ కోసం పోటీ పడుతున్నట్లయింది. అందుకే క్రికెట్ లో విజయం అనేది ఎవరది అనేది చివర వరకూ చెప్పలేం.
Next Story