Sun Dec 22 2024 18:15:07 GMT+0000 (Coordinated Universal Time)
T20 World Cup 2024 : సంచలనం.. ఆప్ఘనిస్థాన్ సెమీ ఫైనల్స్ కు.. ప్రపంచ ఛాంపియన్ ఆసీస్ ఇంటికే
టీ 20 వరల్డ్ కప్ లో సంచలనాలు నమోదవుతున్నాయి. బంగ్లాదేశ్ పై ఆప్ఘనిస్థాన్ విజయం సాధించి సెమీఫైనల్స్ కు చేరుకుంది
టీ 20 వరల్డ్ కప్ లో సంచలనాలు నమోదవుతున్నాయి. బంగ్లాదేశ్ పై ఆప్ఘనిస్థాన్ విజయం సాధించడంతో ఆ జట్టు సెమీఫైనల్స్ కు చేరుకుంది. దీంతో ఆస్ట్రేలియా ఇక సెమీస్ కు చేరకుండానే ఇంటి దారి పట్టింది. ఆస్ట్రేలియా భవిష్యత్ బంగ్లాదేశ్ - ఆప్ఘనిస్థాన్ మ్యాచ్ పైనే ఆధారపడి ఉండటంతో యావత్ ప్రపంచంలోని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చివరకు ఆప్ఘనిస్థాన్ గెలిచి సెమీస్ కు ప్రవేశించింది. టీ 20 వరల్డ్ కప్ లో తొలిసారి ఆప్ఘనిస్థాన్ సెమీ ఫైనల్స్ కు చేరుకుంది. తొలిసారి ఆస్ట్రేలియా సెమీస్ కు చేరకుండానే వెనుదిరిగింది. ఎంత చిత్రం.. ఎంత విచిత్రం.. విశ్వవిజేతలుగా చెప్పుకునే జట్టుకు ఇప్పుడు వరస ఓటములతో ఇబ్బంది కరంగా మారింది.
లీగ్ మ్యాచ్ లలో...
ఆప్ఘనిస్థాన్ జట్టు లీగ్ మ్యాచ్ లలోనూ అదరగొట్టింది. సూపర్ 8 లోనూ ఆస్ట్రేలియాను ఓడించి సంచలనం సృష్టించింది. ఆస్ట్రేలియాను ఓడించినప్పుడే ఆ జట్టు సంబరాలు చూసి తీరాలి. దేశమంతా ఒకచోట చేరి కప్పు గెలిచినంత పండగ చేసుకున్నారంటే ఎన్నాళ్ల నుంచి ఆ విజయం కోసం వేచి చూస్తున్నారన్నది అర్థం చేసుకోవచ్చు. పేరున్న పాకిస్థాన్ జట్టు సూపర్ 8కు చేరుకోకుండానే ఇంటి దారి పడితే ఆప్ఘనిస్థాన్ మాత్రం అన్ని అడ్డంకులను అధిగమించి సెమీ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. అది ఈనెల 27వతేదీన సెమీ ఫైనల్స్ లో సౌతాఫ్రికాతో తలపడనుంది. పసికూనగా భావించిన జట్టు ప్రపంచ ఛాంపియన్ ను ఇంటికి పంపించడమంటే మామూలూ విషయం కాదు.
అభినందించాల్సిందే...
ఆప్ఘనిస్థాన్ జట్టు భారత్ పై ఆడి ఓటమి పాలయింది. అయితే అదే జట్టు ఆస్ట్రేలియా పై గెలిచింది. ఈరోజు బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆప్ఘనిస్థాన్ 20 ఓవర్వలకు 115 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ ను 105 పరుగులకే ఆల్ అవుట్ చేయగలిగింది. ఎనిమిది పరుగుల తేడాతో డక్ వర్త్ లూయీస్ పద్ధతిలో ఆప్ఘనిస్థాన్ విజయం సాధించింది. ఎనిమిది బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన బంగ్లాదేశ్ చేతులెత్తేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మొత్తం మీద ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు ఆప్ఘనిస్థాన్ గట్టి దెబ్బే ఇచ్చింది. ఆప్ఘనిస్థాన్ ఆటగాళ్ల తీరును ఎవరైనా అభినందించాల్సిందే. వారు పసికూనలు కాదు.. కసి కూనలుగా మారారని చెప్పక తప్పదు.
Next Story