Fri Dec 20 2024 17:48:59 GMT+0000 (Coordinated Universal Time)
T20 World Cup 2024 : వర్షం పడి ఆట ఆగిందంటే నేరుగా టీం ఇండియా ఫైనల్ లోకి.. మరి ఏం జరుగుతుందో?
టీ20 వరల్డ్ కప్ లో టీం ఇండియా సునాయాసంగా సెమీ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. 27న ఇంగ్లండ్ తో తలపడనుంది
టీ20 వరల్డ్ కప్ లో టీం ఇండియా సునాయాసంగా సెమీ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. ఇప్పటి వరకూ ఓటమి ఎరుగకుండా దూసుకు వచ్చింది. లీగ్ మ్యాచ్ లలో ఐర్లాండ్, అమెరికా, పాకిస్థాన్ లను చిత్తుగా ఓడించిన రోహిత్ సేన సూపర్ 8లోనూ ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ తో పాటు తాజాగా ఆస్ట్రేలియా వైపు కూడా విజయం సాధించడంతో టీం ఇండియాకు తిరుగులేకుండా వరల్డ్ కప్ లో ఆడుతుంది. ఇక అసలైన ఆట ముందుంది. ఈ నెల 27వ తేదీన ఇంగ్లండ్ జట్టుతో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఫైనల్స్ కు చేరినట్లే. మరోవైపు ఆప్ఘనిస్థాన్, సౌతాఫ్రికా మధ్య పోరు జరగనుంది. ఈ రెండింటిలో గెలిచిన జట్లతోనే ఫైనల్స్ జరగనున్నాయి.
తక్కువగా అంచనా...
అయితే ఇంగ్లండ్ జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. రెండేళ్ల క్రితం ఇంగ్లండ్ సెమీ ఫైనల్స్ లోనే భారత్ ను ఓడించింది. అయితే ఇప్పుడు టీం ఇండియా పటిష్టంగా ఉంది. బలంగా ఉంది. అన్ని ఫార్మాట్లలో సత్తా చాటుతుంది. రోహిత్ శర్మ కూడా ఫుల్లు ఫామ్ లోకి వచ్చాడు. కోహ్లియే కుదురుకోవాల్సి ఉంది. మిగిలిన ఆటగాళ్ల తీరును ఏమాత్రం శంకించాల్సిన పనిలేదు. బౌలర్ల విషయంలోనూ మనకు ఇబ్బంది లేదు. బుమ్రా, అర్షదీప్ సింగ్, కులదీప్ యాదవ్, హార్థిక్ పాండ్యా, జడేజా వంట ివాళ్లు క్లిష్ట సమయంలో వికెట్లు తీసి మనకు అనుకూలంగా మ్యాచ్ ను మలుపు తిప్పడంలో సిద్ధ హస్తులు. ఏ రకంగా చూసినా ఇంగ్లండ్ జట్టు కంటే భారత్ జట్టు అన్ని ఫార్మాట్లలో బలంగా ఉంది.
కష్టాలు పడివచ్చినా...
ఇంగ్లండ్ టీం సూపర్ 8కు చేరుకోవడానికి అష్టకష్టాలు పడింది. అది అంత సులువుగా సెమీ ఫైనల్స్ కు చేరలేదు. చివరి నిమిషంలో మ్యాచ్ ను తమవైపునకు తిప్పుకుని అది చివరకు సెమీ ఫైనల్స్ కు చేరింది. స్వదేశంలోనే వెస్టిండీస్ ను ఓడించిన ఇంగ్లండ్ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో స్వల్ప పరుగుల తేడాతో ఓటమి పాలయింది. ఇంగ్లండ్ జట్టులో కెప్టెన్ జోస్ బట్లర్ జోరు మీదున్నాడు. అలాగే ఫిల్ సాల్ట్, జానీ బెయిర్ స్టోలు ఇటీవల జరిగిన ఐపీఎల్ లోనూ మెరిపించారు. మంచి ఫామ్ లో ఉన్నారు. బౌలింగ్ పరంగా కరన్, ఆర్చర్, మొయిన్ ఆలీ, అదిల్ రషీద్, జోర్డాన్ తో బలంగా ఉంది. అందుకే అంత ఆషామాషీ కాదు.
వర్షం పడి రద్దయితే...?
కాకుంటే ఇండియాకు కలసి వచ్చే అంశం ఏంటంటే 27న వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే మాత్రం ఇండియా నేరుగా ఫైనల్స్ కు చేరుకునే అవకాశాలున్నాయి. అదనపు సమయం నాలుగైదు గంటలున్నా వర్షం తగ్గకపోతే సూపర్ 8 లో టాపర్ గా నిలిచిన భారత్ ఫైనల్స్ కు నేరుగా చేరుకుంటుంది. 27వతేదీన వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతుంది. 29న ఫైనల్స్ జరగాల్సి ఉంది. రిజర్వ్ డే లేకపోవడంత ఆరోజు వర్షం కారణంగా భారత్ - ఇంగ్లండ్ మ్యాచ్ రద్దయితే మాత్రం రన్ రేట్, విజయాలు అవకాశాన్ని భారత్ కు ఫైనల్ కు వెళ్లే అవకాశాలు ఇవ్వనున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Next Story