Mon Dec 23 2024 04:39:37 GMT+0000 (Coordinated Universal Time)
T20 World Cup 2024 : ఆ మూడు మ్యాచ్ లే కీలకం.. దీనిని దాటాలంటే టీం ఇండియాకు మాత్రం?
టీ 20 వరల్డ్ కప్ లో టీం ఇండియా వరసగా మూడు మ్యాచ్ లు గెలిచి సూపర్ 8లోకి ప్రవేశించింది.
టీ 20 వరల్డ్ కప్ లో టీం ఇండియా వరసగా మూడు మ్యాచ్ లు గెలిచి సూపర్ 8లోకి ప్రవేశించింది. అమెరికాలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ మూడింటిపై విజయం సాధించింది. ఇందులో పాకిస్తాన్, అమెరికా, ఐర్లాండ్ దేశాలున్నాయి. కెనడాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అయితే ఆడిన మూడు మ్యాచ్ లు అతి కష్టం మీద గెలిచిందనే చెప్పాలి. అక్కడ పిచ్ సహకరించలేదన్న అభిప్రాయం ఉన్నప్పటికీ మనోళ్లు న్యూయార్క్ లో జరిగిన మ్యాచ్ లలో బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. ఈ మూడు విజయాలకు ప్రధాన కారణం బౌలర్లేనని చెప్పాలి. సూపర్ 8 లో గెలిచి సెమీస్ కు చేరాలంటే మనోళ్లు స్వేదం చిందించాల్సిందే.
మరో మూడు దేశాలతో...
ఇక సూపర్ 8 లో మరో మూడు దేశాలతో టీం ఇండియా తలపడనుంది. ఈ మూడు దేశాలపై గెలవడం అంత ఆషామాషీ కాదు. ఏ జట్లపై పోటీ పడనుందన్న విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఉన్నప్పటికీ ఆస్ట్రేలియాతో మ్యాచ్ మాత్రం ఆడాల్సి ఉంది. ఈ నెల 24వ తేదీన టీం ఇండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది. అలాగే జూన్ 20వ తేదీన ఆప్ఘనిస్తాన్ తో ఆడాల్సి ఉంటుంది. ఇక జూన్ 22వ తేదీన మాత్రం బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ తో తలపడాల్సి ఉంటుంది. ఈ మెట్టును అధిగమించడం అంత సులువు కాదు. ఆస్ట్రేలియా టీ 20లలో ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉంది. ఈ దేశాన్ని గెలవడం అంత సులువు కాదు. అదే సమయంలో బంగ్లాదేశ్ కూడా సంచలనాలకు మారుపేరు. అదే ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ లో గుబులు రేపుతుంది.
బ్యాటింగ్ పరంగా...
బ్యాటింగ్ పరంగా చూస్తే ట్రాక్ రికార్డు మాత్రం భలేగా ఉంది. అందరూ హేమాహేమీలే ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కొహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శివమ్ దూబే, హార్ధిక్ పాండ్యా, అక్షర పటేల్ వరకూ అందరూ హిట్టర్లే. ఒకరు కాకపోయినా మరొకరు నిలుచుని స్కోరు బోర్డును ముందుకు తీసుకెళతారు. అయితే గత మూడు మ్యాచ్ లలో వరసగా విఫలమవ్వడం కొంత ఆందోళనకు గురి చేస్తున్నా వెస్టిండీస్ పిచ్ లపై ఆడిన అనుభవంతో కొంత మెరుగైన ఫలితాలు వస్తాయని క్రికెట్ పండితులు చెబుతున్నారు. అయితే గతంలో నిర్వహించిన ప్రపంచ కప్ లో సూపర్ ఎయిట్ లో పెద్దగా రాణించలేకపోవడం కూడా ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తుంది. బౌలర్లు అయితే బాగానే రాణిస్తున్నారు. అయితే సమిష్టిగా రాణించి సూపర్ 8 లోనూ వరస విజయాలను సాధించాలని భారత్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Next Story