Fri Nov 22 2024 21:30:52 GMT+0000 (Coordinated Universal Time)
World Cup 2023 : సండే... సొంత మైదానం... మజాయే కదా?
వన్డే ప్రపంచ కప్ లో నేడు టీం ఇండియా ఇంగ్లండ్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ ను గెలిస్తే భారత్ దాదాపుగా సెమీస్ కు చేరినట్లే
వన్డే ప్రపంచ కప్ లో నేడు టీం ఇండియా ఇంగ్లండ్ జట్టుతో తలపడనుంది. లక్నోలో జరుగుతున్న ఈ మ్యాచ్ ను గెలిస్తే భారత్ దాదాపుగా సెమీస్ కు చేరినట్లే. ఇప్పటికే ఐదు వరస విజయాలతో టీం ఇండియా దూకుడు మీద ఉంది. ఆటగాళ్లంతా ఫుల్ ఫాం లో ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా సమర్థంగా ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నారు. ఫీల్డింగ్ లోనూ భారత్ జట్టు సత్తా చాటుతుంది. దీంతో ఈరోజు జరిగే పోరులో భారత్ గెలిస్తే దాదాపు సెమి ఫైనల్స్ కు చేరినట్లే. ఇప్పటికే ఐదు విజయాలు సాధించి పది పాయింట్లు సాధించిన భారత్ జట్టు ఈ మ్యాచ్లోనూ గెలిస్తే పన్నెండు పాయింట్లతో పట్టికలో మరోసారి అగ్రస్థానంలో నిలవనుంది.
బ్యాటింగ్ పరంగా...
భారత్ జట్టులో రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఓపెనర్లుగా దిగి రాణిస్తున్నారు. బాదితే బంతి బౌండరీ లైన్ దాటుతుంది. రోహిత్ పది ఓవర్లు క్రీజ్ లో ఉంటే చాలు భారత్ కు తగినంత స్కోరు లభిస్తున్నంత ధైర్యముంది. తర్వాత శుభమన్ గిల్ కూడా అంతే. అవసరమైనప్పుడల్లా షాట్లు ఆడుతూ బంతిని సిక్సర్, బౌండరీలుగా మలుస్తూ స్కోరు బోర్డును పరుగులు తీయిస్తున్నాడు. ఆ తర్వాత వచ్చే విరాట్ కొహ్లి గురించి చెప్పాల్సిన పనిలేదు. మ్యాచ్ విన్నర్ గా ఇప్పటికే వరల్డ్ కప్ లో అనేక మ్యాచ్ లలో తన ప్రదర్శన చూపించాడు. శ్రేయస్ అయ్యర్ కూడా సొగసైన షాట్లతో బంతితో ఒక ఆటాడుకుంటున్నాడు. కెఎల్ రాహుల్ కూల్ గా తన పని తాను చేసుకుపోతున్నాడు.
బౌలింగ్ కూడా...
ఇలా జడేజా వరకూ అందరూ బ్యాటింగ్ పరంగా దిగ్గజాలే. ఛేజింగ్ అయితే ఏ మాత్రం భయపడాల్సిన పని భారత్ అభిమానికి లేకుండా చేశారు. మూడు వందల పరుగుల టార్గెట్ అయినా సులువుగా ఛేదన చేసేందుకు భారత్ బలగం పట్టిష్టంగా ఉంది. ఇక బౌలింగ్ పరంగా చూస్తే బుమ్రా, షమి, సిరాజ్ లు తొలి స్పెల్లోనే వికెట్లు తీస్తున్నారు. ఇక కులదీప్ యాదవ్, జడేజాలు తమ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్టును కట్టడి చేస్తున్నారు. ఇలా అన్ని రకాలుగా పటిష్టంగా ఉన్న భారత్ జట్టు వారం రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ మ్యాచ్ లోకి దిగనుంది. ఆదివారం కావడంతో లక్నోలో స్టేడియం మొత్తం ఫ్యాన్స్ తో నిండిపోతుంది. భారత్ అభిమానులు ఎక్కువ... అదీ సొంత మైదానం... పైగా ఆదివారం.. ఇక చేసుకోండి మజా అన్నట్లుగా ఈరోజు మ్యాచ్ ఉండబోతుందన్న అంచనాలు వినపడుతున్నాయి.
ఇంగ్లండ్ ను తక్కువగా అంచనా వేస్తే....
ఇంగ్లండ్ జట్టును చూస్తే జాలేస్తుంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఈ వరల్డ్ కప్ లో దాదాపు సెమీస్ నుంచి నిష్క్రమించింది. ఆడిన అన్ని మ్యాచ్లలో ఒకటి మినహా మిగిలిన వాటిలో దానికి పరాజయమే మిగిలింది. అనేక అవస్థలతో అది అల్లాడిపోతుంది. అయితే ఎటూ సెమీస్ ఆశలు సన్నగిల్లాయి కాబట్టి చావో రేవో తేల్చుకోవడానికి ఆ జట్టు సిద్ధపడే అవకాశాలున్నాయి. గెలవాలన్న లక్ష్యం లేదు. కేవలం భారత్ ఓడించాలన్న టార్గెట్ తోనే ఇంగ్లండ్ గుడ్డిగా ఆడుతుందన్న అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే భారత్ ఆచి తూచి ఆడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ గెలిస్తే వరస విజయాలతో భారత్ పన్నెండు పాయింట్లతో తిరిగి అగ్రస్థానం చేరడమే కాకుండా సెమీస్ కు దాదాపు చేరుతుంది. అందుకే రోహిత్ సేన ఈ మ్యాచ్ ను కీలకంగా తీసుకుని అన్ని రకాలుగా పోరాడాల్సి ఉంది.
Next Story