Mon Dec 23 2024 07:09:33 GMT+0000 (Coordinated Universal Time)
World cup 2023 : నాలుగింటిపైనా గెలుపోటముల పరిస్థితి ఏంటంటే?
టీం ఇండియా వరస విజయాలతో దూసుకుపోతుంది.అయితే రానున్న నాలుగు మ్యాచ్లు ఇండియాకు కీలకమనే చెప్పాలి
టీం ఇండియా వరస విజయాలతో దూసుకుపోతుంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం అగ్రస్థానంలో నిలిచింది. అయితే రానున్న నాలుగు మ్యాచ్లు ఇండియాకు కీలకమనే చెప్పాలి. ఇప్పటి వరకూ భారత్ ఐదు దేశాలను ఓడించి పది పాయింట్లను సాధించింది. రన్ రేట్ లో కూడా బాగానే ఉంది. సెమీ ఫైనల్ కు వెళ్లడానికి ఇక ఎంతో దూరం లేదు. అయితే మరో నాలుగు దేశాలతో ఇండియా ఆడాల్సి ఉంది. వాటిలో కూడా వరస విజయాలు సంభవిస్తే ఇక టీం ఇండియాకు తిరుగులేనట్లే భావించాలి.
ఐదు దేశాలతో ఆడి...
ఇప్పటి వరకూ భారత్ ఆస్ట్రేలియాను చిత్తుచిత్తుగా ఓడించింది. పాక్ ను మట్టి కరిపించింది. బంగ్లాదేశ్ పై కూడా అఖండ విజయం సాధించింది. ఆప్ఘనిస్థాన్ పై ఆడుతూ పాడుతూ గెలిచింది. ఇక న్యూజిలాండ్ పై పోరాడి గెలిచిన టీం ఇండియా మరో నాలుగు టీంలతో ఆడాల్సి ఉంది. ఇక సౌతాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్, నెదర్లాండ్స్ మీద భారత్ ఆడాల్సి ఉంది. ఈ నాలుగింటిలో రెండు టీంలు బలంగానే కనిపిస్తున్నాయి. ఆ రెండు టీంల పై విజయం సాధిస్తే పద్దెనిమిది పాయింట్లతో భారత్ వరల్డ్ కప్ లో ఏకైక దేశంగా నిలుస్తుంది.
సౌతాఫ్రికాతో అంత సులువు కాదు...
ఇప్పటి వరకూ ఆడిన అన్ని దేశాలు ఏదో ఒక టీం చేతిలో ఓటమి పాలయ్యాయి. మొన్నటి వరకూ న్యూజిలాండ్ కూడా ఆ ఘనత ఉంది. అయితే నిన్న భారత్ తో ఓటమి పాలయిన తర్వాత ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో వెనకబడి పోయింది. ఈ నాలుగు టీంలలో సౌతాఫ్రికా బలంగా కనిపిస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఆ కంట్రీ మంచి ఫామ్ లో ఉండటంతో టీం ఇండియా సౌతాఫ్రికాపై ఆచితూచి ఆడాల్సి ఉంటుంది. సౌతాఫ్రికా కూడా నెదర్లాండ్స్ చేతిలో ఓటమి పాలయింది. అయితే వర్షం కారణంగా డక్ వర్త్ లూయీస్ పద్ధతిలో నిర్దేశించిన పరుగులను తగిన ఓవర్లలో చేయలేకపోవడంతో పరాజయాన్ని మూటగట్టుకుంది. లేకుంటే ఆ దేశం కూడా స్ట్రాంగ్ గానే కనపడుతుంది.
నెదర్లాండ్స్ పై నిర్లక్ష్యం తగదు...
ిఇక శ్రీలంక విషయానికొస్తే మొదట్లో కొంత తడబడినా ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. శ్రీలంక మీద కూడా భారత్ కు విజయం అంత ఆషామాషీ కాదు. శ్రీలంక ను ఓడించిన తర్వాత ఇంగ్లాండ్ జట్టును కూడా ఓటమి వైపు వెళ్లేలా చూడగలగాలి. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఈసారి పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది. అయినా మంచి ప్లేయర్లు ఉండటంతో జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. మరో చిన్న దేశమైన నెదర్లాండ్స్ ను నిర్లక్ష్యం చేయడానికి వీలులేదు. సౌతాఫ్రికాను ఓడించి అది ఊపు మీద ఉంది. నాలుగు టీంలతో జాగ్రత్తగా ఆడాల్సి ఉంది. ఈ టీంతోనే బరిలోకి దిగితే చాలా వరకూ మనకే విజయాలు సొంతమవుతాయి.
Next Story