Fri Dec 20 2024 03:50:58 GMT+0000 (Coordinated Universal Time)
World cup 2023 : ఇద్దరిలో తేడా అదే.. ఛాన్స్ ఇచ్చినా అంతేగా
భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో షమి సక్సెస్ కాగా, సూర్యకుమార్ యాదవ్ ఫెయిల్ అయ్యాడు
ఛాన్స్లు ఎప్పుడూ రావు. అంది వచ్చిన అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకుంటేనే ఎందులోనైనా ఎదుగుతారు. అది క్రికెట్ అయినా.. మరో ప్రొఫెషన్ అయినా ఇదే సూత్రం వర్తిస్తుంది. భారత్ వరల్డ్ కప్ లో ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్ లు ఆడింది. నాలుగు మ్యాచ్లో కొందరిని బెంచ్ కే పరిమితం చేసింది. అయినా విజయం తప్పని సరి అయింది. వరస విజయాలతో ఉన్న భారత్ జట్టులో పెద్దగా మార్పులు ఉండవని అందరూ అంచనా వేసుకున్నారు. కానీ హార్దిక్ పాండ్యా గాయపడటంతో మరో బ్యాటర్ అవసరమయింది. బౌలర్ అవసరం కూడా పడింది.
హార్థిక్ గాయంతో...
హార్ధిక్ పాండ్యా గాయంతోనే సూర్యకుమార్ యాదవ్ కు న్యూజిలాండ్తో జరిగిన ఐదో మ్యాచ్లో అవకాశం దక్కింది. అలాగే శార్దూల్ ఠాకూర్ పై వరస విమర్శలు వెల్లువెత్తడంతో మహ్మద్ షమికి ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడాలనుకున్నారు సెలక్టర్లు. సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమిలు ఇద్దరూ నాలుగు మ్యాచ్ల వరకూ బెంచికే పరిమితమయ్యారు. అయితే వచ్చిన అవకాశాన్ని మహ్మద్ షమి ఉపయోగించుకోగా, సూర్యకుమార్ యాదవ్ మాత్రం తనకు ఇచ్చిన ఛాన్స్ ను చేజేతులా చేజార్చుకున్నాడు. ఇద్దరూ వయసు కొంచెం ఎక్కువ ఉన్నవారే. మూడు పదుల వయసు దాటిన వారే. కానీ తనలో పస తగ్గలేదని షమి నిరూపించుకోగా, సూర్యకుమార్ మాత్రం పేలవ ప్రదర్శన చేసి ఫ్యాన్స్ ను కలవరపెట్టాడు.
ఐదు వికెట్లు తీసి...
ముందుగా మహ్మద్ షమి విషయానికి వస్తే వరల్డ్ కప్లో తొలి మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ భరతం పట్టాడు. షమి బౌలింగ్ కు న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్ కకా వికలమయింది. షమి తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. చక్కటి లైన్ అండ్ లెన్త్ బౌలింగ్ వేసి న్యూజిలాండ్ బ్యాటర్లను పెవిలియన్ పట్టించాడు. మూడు వందలకు పైగా పరుగులు చేస్తుందన్న న్యూజిలాండ్ ను 273 పరుగులకే పరిమితం చేయడం వెనుక షమి కృషిని తప్పకుండా చెప్పుకుని తీరాల్సిందే.
అనవసర పరుగు కోసం..
ఇక సూర్యకుమార్ యాదవ్ విషయాని కొస్తే అనవసర పరుగు తీసి అందరినీ టెన్షన్ లోకి నెట్టేశాడు. సూర్యకుమార్ యాదవ్ తనకు వచ్చిన ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. బంతి అక్కడ ఉండగానే పరుగు తీసి దాదాపు ఎండ్ వరకూ వచ్చేశాడు. కాని ఫామ్ లో ఉన్న విరాట్ కొహ్లి వెనక్కు వెళ్లడంతో సూర్య అవుట్ కావాల్సి వచ్చింది. కొహ్లి తీసుకున్న నిర్ణయం కరెక్టే. తాను ఫామ్ లో ఉండటంతో తాను అవుటయితే భారత్ విజయం కష్టమని భావించి సూర్యకుమార్ అవుట్ అవ్వడానికే మొగ్గు చూపాడు. అందుకే ఛాన్స్ ఊరికే రాదు.. వచ్చిన అవకాశాన్ని వదులుకోరాదు.. అన్నది ఈ ఇద్దరి విషయంలో స్పష్టంగా తేలిపోయింది.
Next Story