Fri Dec 20 2024 22:04:55 GMT+0000 (Coordinated Universal Time)
ఈసారైనా దక్కేనా?
వరల్డ్ కప్ ను ముద్దాడాలన్నది ప్రతి క్రికెట్ జట్టుకు ఉన్న బలమైన ఆకాంక్ష. భారత్ జట్టు బలంగా ఉంది. అయితే లక్ కలసి రాావాలి
వరల్డ్ కప్ ను ముద్దాడాలన్నది ప్రతి క్రికెట్ జట్టుకు ఉన్న బలమైన ఆకాంక్ష. తుది వరకూ పోరాడి కప్ ను సొంతం చేసుకోవాలని ప్రతి జట్టు కలలు కంటోంది. మరో వారం రోజుల్లో ప్రపంచ కప్ ప్రారంభం కాబోతుంది. అయితే ఎవరి అంచనాలు వారికున్నాయి. పది జట్లు హోరాహోరీ పోరాటం చేస్తాయి. మైదానంలో ఎవరిది పై చేయి అన్నది ఇప్పుడికప్పుడు అంచనా వేయలేని పరిస్థితి. ఆటగాళ్లు క్లిక్ అయితే చాలు ఆ జట్టు విజయాన్ని ఆ మ్యాచ్ లో సొంతం చేసుకుంటుంది. ఒక్క పరుగుతో గెలిచిన సందర్భాలు కూడా లేకపోలేదు.
ఇదే ప్లస్...
అయితే సొంత గడ్డపై ఆడుతున్న భారత్ జట్టుకు ఇదొక సువర్ణ అవకాశం. దాదాపు పదమూడేళ్ల తర్వాత ప్రపంచ కప్ ను సొంతం చేసుకునే అవకాశం భారత జట్టుకు లభించింది. 2011లో భారత్ చివరి సారి వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కప్ అనేది కలగానే మిగిలింది. పటిష్టమైన జట్టుగా భావిస్తున్నప్పటికీ గ్రౌండ్ లో క్రికెటర్ల ఆటతీరును బట్టి గెలుపోటములు డిసైడ్ అవుతాయి. భారత్ జట్టు బలమైనదే. బౌలింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా అత్యుత్తమ జట్టు అనే చెప్పుకోవాలి.
మైదానంలో...
కానీ ఇది క్రికెట్. పసికూన అని భావించే జట్లు సయితం మ్యాచ్ ను తమ వైపునకు తిప్పుకోగలుగుతాయి. వెస్టిండీస్ వంటి జట్టుకు వరల్డ్ కప్ లో చోటు లేకపోయిందంటే అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితుల్లో అనేక మంది అంచనాల ప్రకారం భారత్ ఖచ్చితంగా సెమీ ఫైనల్స్ కు చేరుకుంటుందని చెబుతున్నారు. హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న జట్లు ఇండియా, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు అని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. భారత్ ఈ అవకాశాన్ని చేజార్చుకోదనే ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇలా జరిగితే...
శుభమన్ గిల్, రోహిత్ శర్మ నిలదొక్కుకుంటే ప్రత్యర్థి ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచే అవకాశాలున్నాయి. కొహ్లి చెలరేగితే ఇక స్కోరు బోర్డు పరుగులు తీస్తుంది. సిరాజ్, బుమ్రా వంటి బౌలర్లు చేయి తిరగితే వికెట్లు టపా టపా పడిపోతాయి. కానీ అన్ని సార్లు అదృష్టం ఒకవైపే ఉండదు. లక్ మారుతుంటుంది. అలాగే క్రికెట్ లోనూ గెలుపోటములు సహజం. ఆటను సీరియస్ గా తీసుకోవాలే కాని, స్పోర్టివ్ స్పిరిట్ కూడా అంతే అవసరం. అభిమానులు హద్దులు దాటకుండా ఉండటం అందరికీ మంచిది. ఎవరు గెలిచినా ఒకటే. అయితే భారత్ గెలిస్తే మనకు ఆనందం కలిగినట్లే... ప్రత్యర్థి ఆటగాళ్ల తీరును కూడా మెచ్చుకున్న వాళ్లే అసలైన క్రికెట్ అభిమాని. ఆ విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు.
Next Story