Sun Dec 22 2024 19:15:26 GMT+0000 (Coordinated Universal Time)
World Cup Finals 2023 : హిట్ మ్యాన్ ఫైనల్స్‌లోనూ సూపర్ హిట్ అవుతాడా? అంచనాలివే
భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగనుంది.
వరల్డ్ కప్ ఫైనల్స్‌కు మరి కొద్ది గంటల సమయం ఉంది. బిగ్ సండేలో బిగ్ విక్టరీ కొట్టాలని అందరూ భావిస్తున్నారు. భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగనుంది. ఇప్పటి వరకూ ఈ వరల్డ్ కప్ లో ఓటమి ఎరుగని టీం ఇండియా ఫైనల్స్ లోనూ తమ సత్తా చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇండియా మొత్తం క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. దీంతో అంచనాల పెరగడంతో పాటు వత్తిడి కూడా ఇరు జట్లపై పెరిగిందనే చెప్పాలి. బెట్టింగ్ లు కూడా ఈసారి భారీ స్థాయిలో జరిగే అవకాశాలున్నాయని పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది.
రోహిత్ పైనే...
అయితే ఇదిలా ఉంటే ఇప్పుడు టీం ఇండియాలో రోహిత్ శర్మ పైనే అంతా చర్చ జరుగుతుంది. కెప్టెన్ గా రోహిత్ శర్మ తీసుకునే నిర్ణయాలు.. ఆడిన తీరు..ను సీనియర్ క్రీడాకారులందరూ సమర్ధిస్తున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీంను వత్తిడిలోనూ విజయాలవైపు తీసుకొచ్చిన ఘనత రోహిత్ కే దక్కుతుందని చెప్పాలి. ఓటమి పాలయ్యే మ్యాచ్ నుంచి విక్టరీ వైపు నడిపించేలా రోహిత్ శర్మ కెప్టెన్ గా తీసుకున్న కీలక నిర్ణయాలు.. అందరి మన్ననలను పొందుతున్నాయి. రోహిత్ శర్మకు కూడా ఇదే ఆఖరి వరల్డ్ కప్ కావడంతో ఆయన అభిమానులంతా ఈ వరల్డ్ కప్ ను రోహిత్ చేత బూనాలని ఆకాంక్షిస్తున్నారు.
ఓపెనర్ గా దిగి...
రోహిత్ శర్మ ఫామ్ లో ఉన్నాడు. ఆ విషయంలో ఎవరికీ డౌట్ లేదు. నిలబడ్డాడంటే.. ఉతికేస్తాడంతే. ఇప్పటి వరకూ ఈ వరల్డ్ కప్ లో ఎక్కువ పరుగులే చేశాడు. ఓపెనర్ గా దిగిన రోహిత్ శర్మ తొలి పవర్ ప్లేలోనే అత్యధిక పరుగులను సాధించి పెడుతుండటంతో తర్వాత వచ్చే వారిపై వత్తిడి సహజంగానే తగ్గుతుంది. ఓపెనర్ గా దిగిన రోహిత్ సిక్సర్లు, ఫోర్లు బాదుతూ ప్రత్యర్థితో మైండ్ గేమ్ ప్రారంభిస్తారు. బౌలర్లను వత్తిడికి గురి చేస్తున్నాడు. ఈ వరల్డ్ కప్ లో ఒకటి, రెండు మ్యాచ్ లు మినహా ఆయన దాదాపు అన్ని మ్యాచ్ లలోనూ సక్సెస్ ఫుల్ గానే ఆడాడు. స్కోరు బోర్డును తొలి పది ఓవర్లలోనే పరుగులు పెట్టించిన ఘనత రోహిత్ శర్మదే.
రికార్డుల కోసం...
అలాగే రోహిత్ శర్మ ఎప్పుడూ రికార్డుల కోసం పాకులాడడు. ఆ గేమ్ విజయం పైనే దృష్టి పెడతాడు. ఎన్ని సార్లు హాఫ్ సెంచరీలు మిస్ చేసుకున్నాడో ఈ వరల్డ్ కప్ లోనే అందరం చూశాం. బంతి పైకి లేపి దొరికిపోతున్నాడు తప్పించి హాఫ్ సెంచరీకి జిడ్డు ఆట ఆడితే హాఫ్ సెంచరీలు ఆయన ఖాతాల్లో ఖచ్చితంగా జమఅయ్యేవి. అందుకే రోహిత్ శర్మను మొదటి రెండు, మూడు ఓవర్లలోనే అవుట్ చేయాలని ప్రత్యర్థి జట్టు ప్రయత్నిస్తుంది. అత్యధిక సిక్సర్లు కూడా ఈ వరల్డ్ కప్ లో బాదింది రోహిత్ మాత్రమే. అందుకే ఇన్ని విజయాలను మనకు మూట కట్టి మరీ అందించాడు. ఫైనల్స్ లోనూ హిట్ మ్యాన్ ఆ దూకుడు కొనసాగితే ఇక విజయం మనదే. కప్పు కూడా మనదే. హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ.
Next Story