రెండు ఎన్నికలకంటే...
ఈసారి కారు పార్టీకి విజయం అంత సులువు కాదు. గత రెండు ఎన్నికలకు ఈ ఎన్నిక భిన్నమైనది. కేసీఆర్ ఇమేజ్ మీదనే మళ్లీ గెలిచే అవకాశాలు కూడా తక్కువగానే కనిపిస్తున్నాయి. గత రెండు ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల కోసం బీఆర్ఎస్ శ్రమించాల్సి ఉంటుంది. అయితే చిట్టచివరకు ప్రజలు ఆదరిస్తారా? లేదా? అన్నది కూడా డౌటే. బీఆర్ఎస్ పై వ్యతిరేకతకు అనేక కారణాలున్నాయి. కొన్ని సంక్షేమ పథకాలు పార్టీకి తలనొప్పిగా మారనున్నాయి. కేసీఆర్ వేసుకున్న అంచనా తలకిందులు కావడంతో ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ విజయం కోసం కారు పార్టీ దోబూచులాడక తప్పని పరిస్థితి నెలకొంది.
అంతకు ముందు...
2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నేతగా కేసీఆర్‌కు మంచి గుర్తింపు ఉంది. తెలంగాణ సమాజం మొత్తం ఆయన నాయకత్వాన్ని బలంగా కోరుకుంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కంటే తెచ్చిన కేసీఆర్ వైపే ప్రజలు మొగ్గు చూపారు. అలా తొలిసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాగలిగింది. రెండోసారి తాను అమలు చేసే పథకాలు, ప్రాజెక్టులు కొనసాగాలంటే మరొకసారి దీవించాలంటూ ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. దీంతో పాటు చంద్రబాబుతో కాంగ్రెస్ మహాకూటమిగా ఏర్పడటం కూడా కేసీఆర్‌కు కలసి వచ్చింది. దీంతో రెండోసారి కూడా సెంటిమెంట్ కలసి వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి కాగలిగారు.
సంక్షేమ పథకాలు...
కానీ ఈసారి ఆ పరిస్థితులు లేవు. తొమ్మిదేళ్ల పాలనను తెలంగాణ ప్రజలు చూశారు. సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులవుతున్నా కొన్ని విషయాల్లో అవి ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నాయి. దళితబంధు పథకం కింద పది లక్షల రూపాయలు కొందరికే కేటాయించారు. అది మిగిలిన వారిలో అసంతృప్తి నెలకొంది. డబుల్ బెడ్ రూం ఇళ్లను కూడా ఎమ్మెల్యేలు తమ అనుచరులకే కేటాయించారు. అది కూడా వివాదాస్పదమయింది. అనేక చోట్ల ఎమ్మెల్యేలపై విపరీతమైన అసంతృప్తి ఉందన్నది వివిధ సర్వేల ద్వారా స్పష్టమవుతూ వస్తుంది. కుటుంబ పాలనతో పాటు అవినీతి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ వంటి వి కూడా పార్టీపై వ్యతిరేకతను పెంచాయంటున్నారు. కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కోవడం కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారింది.
ఎమ్మెల్యేలపై వ్యతిరేకత...
కానీ గులాబీ బాస్ మాత్రం చివరకు 99 శాతం టిక్కెట్లు సిట్టింగ్‌లకే కేటాయించారు. నియోజకవర్గాల్లో పార్టీలో అసంతృప్తులకు ఏమాత్రం కొదవలేదు. ఎమ్మెల్యే అభ్యర్థులకు వ్యతిరేకంగా గ్రూపులు ఎక్కువగా ఉన్నాయి. వారి నుంచి ఈ ఎన్నికల్లో సహకారం అందే అవకాశం లేదు. పైగా కేసీఆర్ అనుకున్నట్లు బీజేపీ పెద్దగా బలపడలేదు. కాంగ్రెస్ పుంజుకుంది. బీజేపీ బలపడితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని భావించిన కేసీఆర్ అంచనా వాస్తవ రూపం దాల్చపోవడంతో ఇప్పుడు ఫైట్ మామూలుగా లేదు. కేసీఆర్ రంగంలోకి దిగి తనదైన వ్యూహాలను అమలుపరిస్తే తప్ప ఈసారి విక్టరీ అంత సులువు కాదన్నది వాస్తవం. మరి కేసీఆర్ స్ట్రాటజీలపైనే ఈసారి గెలుపు ఆధారపడి ఉంటుందన్నది సొంత పార్టీ నేతలే అంగీకిస్తున్న విషయం. మరి ఏం జరుగుతుందో చూడాలి.