Telangana congress : సమయం సరిపోతుందా...ఇలాగయితే ఎలా భయ్యా?

కాంగ్రెస్ తొలి విడత అభ్యర్థుల జాబితా విడుదలయింది. రెండో విడత లిస్ట్ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు

Update: 2023-10-25 03:33 GMT

కాంగ్రెస్ తొలి విడత అభ్యర్థుల జాబితా విడుదలయింది. యాభై ఐదు మంది అభ్యర్థులతో వచ్చిన తొలి జాబితాలో అక్కడక్కడ కొంత అసంతృప్తులున్నా పెద్దగా అవి కనిపించలేదు. ఫస్ట్ లిస్ట్ సూపర్బ్ అని మెచ్చుకున్న వారు కూడా లేకపోలేదు. అన్ని వర్గాలకూ స్థానం కల్పిస్తూ విడుదల చేసిన జాబితాతో కొంత కాంగ్రెస్ కు హైప్ క్రియేట్అయింది. గాంధీభవన్ వద్ద నిరసనలు, డౌన్ డౌన్ నినాదాలు వినిపించినా వాటిని పెద్దగా పట్టించుకోలేని పరిస్థితి. కానీ రెండో జాబితా ఇంత వరకూ విడుదల కాలేదు. ఎన్నికలకు ఇంకా నలభై రోజులకు మించి సమయం లేదు. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలోకి వెళ్లింది.

కర్ణాటక తరహాలోనే...
కర్ణాటక తరహాలో ఆరు నెలల ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పిన పార్టీ హైకమాండ్ తెలంగాణ విషయానికి వచ్చే సరికి మాత్రం కొంత వెనక్కు తగ్గింది. నలభై రోజులే ఎన్నికలకు సమయం ఉన్నా ఇంకా సగానికి మించిన సీట్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు. సీనియర్ నేతలకే టిక్కెట్లు దక్కకపోవడంతో అభ్యర్థులు కూడా ప్రచారం చేసుకోలేకపోతున్నారు. ఆరు గ్యారంటీల హామీలు ఇచ్చి నెలన్నర అవుతున్నా నియోజకవర్గాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి అభ్యర్థుల ఖరారు కాకపోవడమేనని చెబుతున్నారు. రాహుల్ గాంధీ మొదటి విడత బస్సు యాత్ర సూపర్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఆయన రెండో విడత కూడా రాష్ట్రానికి రానున్నారు.
ఇంకా భర్తీ కాకపోవడంతో...
ముఖ్యమైన స్థానాలను ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. ఇంకా ఢిల్లీలో కసరత్తు జరగుతూనే ఉంది. నేతలు హస్తినలోనే మకాం వేశారు. దసరా పండగ కూడా ఈసారి నేతలకు లేకుండా పోయింది. ఏఐసీసీ భవన్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. తమ అనుచరులతో వెళ్లి కొందరు అక్కడ ఆందోళనకు కూడా దిగుతున్నారు. చివరి నిమిషంలోనైనా పార్టీ హైకమాండ్ మనసు మార్చే ప్రయత్నం మరికొందరు చేస్తున్నారు. నెల రోజులలో నియోజకవర్గమంతటా తిరగాలంటే అభ్యర్థులకు కష్టమవుతుంది. ఎన్నికలంటే కేవలం ప్రచారం మాత్రమే కాదు. ప్రచార సామాగ్రిని సిద్ధం చేసుకోవడంతో పాటు ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది.
పనంతా పెండింగ్‌లోనే...
ముఖ్యమైన కార్యకర్తలను బూత్ ల వారీగా గుర్తించి, నమ్మకమైన వారిని నియమించుకోవాలి. అంత టైమ్ ఉంటుందా? సమయం లేకుండా హైకమాండ్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి కొన్ని నియోజకవర్గాల్లో ఇబ్బందులు తప్పవన్న కామెంట్స్ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. రెండో విడతలో పూర్తి స్థాయిలో స్థానాలను ప్రకటించాలని నేతలు కోరుతున్నారు. లేకుండా మలి విడతగా మళ్లీ మరో జాబితా అంటే ఇక సమయం ఉండదని చెబుతున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ అన్ని సర్వేల్లో ముందంజలో ఉన్నప్పటికీ అభ్యర్థుల ఖరారు విషయంలో మాత్రం వెనకబడి పోయిందనే చెప్పాలి. మరి ఈరోజు, రేపట్లోనైనా పూర్తి స్థాయి జాబితా వస్తుందని నేతలు భావిస్తున్నారు.


Tags:    

Similar News