తెలంగాణలో పోటీకి రెడీ అవుతున్న టీడీపీ..ఈ పార్టీలతో పొత్తు ఉంటుందా?

Update: 2023-10-17 01:37 GMT

తెలంగాణలో ఎన్నికల సందడి మరింతగా జోరందుకుంటోంది. బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు మాత్రం ఎవరికి వారు వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇక టీడీపీ కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నట్లు వస్తున్న వార్తలపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని స్పందించారు. 87 స్థానాల్లో పోటీ చేసేందుకు టీ-టీడీపీ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. అయితే టీడీపీ ఎన్నికల బరిలో ఉండదని వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. అలాంటివేమి నమ్మవద్దని, ఈ ఎన్నికల్లో బరిలో ఉంటామని తెలిపారు. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోందని పేర్కొన్నారు. అయితే అభ్యర్థుల తరపున నందమూరి బాలకృష్ణ ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఉండే అవకాశం ఉంటుందా..? అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇటీవల రాజమండ్రిలో జనసేన అధ్యక్షుడు పవన్‌‌‌‌ కల్యాణ్‌‌ ఈ రెండు పార్టీల పొత్తుపై స్పష్టమైన ప్రకటన చేశారు. అలానే.. తెలంగాణలో కూడా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖరారైనట్లు సమాచారం.

సీట్ల షేరింగ్‌ మధ్య ఇంకా చర్చలు జరగాల్సి ఉందని తెలుస్తోంది. జనసేన ఇప్పటికే తెలంగాణలో 32 సీట్లు పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయా స్థానాల జాబితాను కూడా ప్రకటించింది. తెలంగాణలో పొత్తు విషయమై.. త్వరలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో చర్చలు జరుగుతాయని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ రెండు పార్టీల పొత్తు విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక తెలంగాణలో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం కూడా ఉంది. ఇటీవల నారా లోకేష్ ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు ఉన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఉండటంతో… తెలంగాణలో బీజేపీ, టీడీపీ పొత్తులపై చర్చలు ఊపందుకున్నాయి. దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. అయితే టీడీపీకి బలమైన అభ్యర్థులు లేకపోయినా.. కొన్ని ప్రాంతాల్లో ఓటు బ్యాంకు ఉంది. తెలంగాణలో టీడీపీ ఓట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఏ పార్టీతో పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తెలిపిన బీజేపీ.. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Tags:    

Similar News