Telangana Congress : ఫైనల్ లిస్ట్ ఆలస్యానికి కారణమదేనా?
తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది. టిక్కెట్ల కోసం నేతలు క్యూ కడుతుండటమే ఇందుకు నిదర్శనం
తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది. టిక్కెట్ల కోసం నేతలు క్యూ కడుతుండటమే ఇందుకు నిదర్శనం. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అధికారంలోకి వస్తుందన్న ఆశతో ఎక్కువ మంది ఆశావహులు ఢిల్లీ బాట పడుతున్నారు. చివరి సారిగా తమ లక్ ను పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ యాభై ఐదు స్థానాలను మాత్రమే కాంగ్రెస్ ప్రకటించింది. ఇంకా అరవైకి పైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రేపో, మాపో చివరి జాబితా విడుదల కానుంది.
అందరూ ఢిల్లీలోనే...
ఈ పరిస్థితుల్లో అందరూ ఢిల్లీ బాట పట్టారు. ఇప్పటికే బీజేపీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఆయనతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి కూడా వెళ్లారు. వీళ్లిద్దరూ రేపు కాంగ్రెస్ కండువా కప్పుకుని వస్తారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు టిక్కెట్ ఇప్పటికే ఖరారయినట్లు ప్రచారం జరుగుతుంది. అక్కడ కోమటిరెడ్డి అయితేనే కాంగ్రెస్ ఖాతాలో ఒక సీటు పడుతుందని భావించిన అధినాయకత్వం ఆయన పేరును ఓకే చేసినట్లు చెబుతున్నారు.
టిక్కెట్ వస్తే చాలు...
మరోవైపు కేఎల్ఆర్ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. అంతా ఢిల్లీలోనే ఉంది. అక్కడే స్క్రీనింగ్ కమిటీ ఉండటం, ఫైనల్ లిస్ట్ తయారవుతుండటంతో పార్టీ నేతల్లో ఆందోళనతో పాటు టెన్షన్ నెలకొంది. ఇప్పటికే నలభై స్థానాల వరకూ కాంగ్రెస్ కమిటీ ఖరారు చేసిందని తెలుస్తోంది. మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నారు. తమ అనుచరులతో కలసి ఢిల్లీ చేరుకున్న నేతలు లాస్ట్ ట్రయిల్ ను వేస్తున్నారు. కాంగ్రెస్ టిక్కెట్ వస్తే చాలు.. గెలిచిపోయినట్లేనన్న ధీమాలో ఉన్నారు.
వడపోతతో...
గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ కు ఈసారి ఇంతటి హైప్ క్రియేట్ అయింది. అందుకే ఆశావహుల సంఖ్య బాగా పెరిగింది. సీటు దక్కకపోతే వీరంతా ఏం చేస్తారన్నది పక్కన పెడితే ఈ ఊపు చాలు కాంగ్రెస్‌కు పాజిటివ్ వేవ్ ఉందని తెలియడానికి. కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ఆచితూచి వ్యవహరిస్తుంది. గెలుపు గుర్రాలకే టిక్కెట్లను కేటాయించాలని భావించి అన్ని రకాలుగా వడపోత కార్యక్రమాన్ని చేపట్టింది. ఎలాంటి సిఫార్సులకు తావివ్వకుండా గెలుపునకు దగ్గరగా ఉన్న వారికే ఈసారి టిక్కెట్లు కేటాయించాలని నిర్ణయించడంతో ఫైనల్ లిస్ట్ ఇంత ఆలస్యమవుతుందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరి సెకండ్ లిస్ట్ వస్తే కాని హస్తం రాత ఎలా ఉంటుందన్నది తేలదు.