Anna Datha Sukhibhava : రైతులకు గుడ్ న్యూస్... అన్నదాత సుఖీభవకు నిధులు కేటాయింపులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాత సుఖీ భవ పథకానికి 6,300 కోట్ల రూపాయలు ఈ ఏడాది కేటాయించింది;

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాత సుఖీ భవ పథకానికి 6,300 కోట్ల రూపాయలు ఈ ఏడాది కేటాయించింది. బడ్జెట్ లో ఈ నిధులను కేటాయించడంతో ఈ ఏడాది రైతులకు ఈ పథకం కింద నిధులు విడుదల చేయనున్నట్లు స్పష్టమైంది. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను వరసగా అమలు చేస్తూ వస్తుంది. అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కలిపి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులను జమ చేయనున్నారు.
ఏడాదికి ఇరవై వేలు...
అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల కు పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. మ్యానిఫేస్టోలో కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. మూడు విడతలుగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరువేల రూపాయల నిధులకు మరో పథ్నాలుగు వేల రూపాయలు జత చేసి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆరు వేల రూపాయలను మూడు విడతలుగా విడతకు రెండు వేల రూపాయల చొప్పున అందచేస్తుంది.
కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి...
అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకం కింద విడతకు నాలుగు వేల రూపాయలు జత చేసి ఇవ్వనుంది. అంటే కేంద్ర ప్రభుత్వం నిధులతో కలిపి ఒక విడతకు ఆరువేల, చివరి విడతకు ఎనిమిది వేల రూపాయల చొప్పున అందనున్నాయి. అయితే వచ్చే సీజన్ నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈసారి విడుదల చేసే నిధులతో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు జత చేసి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతో మరో సూపర్ సిక్స్ హామీని అమలు పర్చేందుకు సిద్ధమయిందని స్పష్టమయింది.