నేడు కోనసీమలో సీఎం జగన్ పర్యటన

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శుక్రవారం డా.బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు

Update: 2023-08-11 02:07 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శుక్రవారం డా.బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. అమలాపురం మండలం జనుపల్లిలో పర్యటిస్తారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి అమలాపురంలోని పోలీస్‌ గ్రౌండ్‌కు సీఎం జగన్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి జనుపల్లి గ్రామానికి చేరుకొని బహిరంగ సభలో పాల్గొంటారు. కోనసీమలో నాలుగో విడత వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల ఖాతాల్లోకి వడ్డీ డబ్బును జమ చేస్తారు. వరుసగా నాలుగో ఏడాదీ వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం నిధులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుక్రవారం విడుదల చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది మహిళలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్‌ చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. నేడు విడుదల చేసే రూ.1,353.76 కోట్లతో కలిపి వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద ఇప్పటివరకు మొత్తం సాయం రూ.4,969.05 కోట్లకు చేరుతుంది.

పేద మహిళలకు సాధికారత కల్పిస్తూ వారు చేస్తున్న వ్యాపారాలకు ఊతమిచ్చేలా సున్నా వడ్డీకే రుణాలు అందించి, వారి జీవన ప్రమాణాలను ప్రభుత్వం మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది. బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాల్లోని మహిళల మీద వడ్డీ భారం పడకుండా వారి తరపున ఆ భారాన్నీ వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద నేరుగా పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది.


Tags:    

Similar News