కోహ్లీ ఫామ్ లోకి రావాలని కోరుకుంటున్న పాక్ లెజెండ్
కోహ్లీ చెత్త ఫామ్ గురించి వసీం అక్రమ్ మాట్లాడుతూ.. అభిమానుల విమర్శలు అనవసరం అని
విరాట్ కోహ్లీ ఫామ్ లో లేకపోవడం దేశాలతో సంబంధం లేకుండా క్రికెట్ అభిమానులను బాధించే విషయం. కోహ్లీ సెంచరీ కొట్టి 1000 రోజుల పైనే అయిందంటే అతడి అభిమానులకే కాదు.. క్రికెట్ ను ఆరాధించే ప్రతి ఒక్కరికీ బాధనే..! కోహ్లీ ఫామ్ లోకి రావాలని పలువురు మాజీ క్రికెటర్లు కూడా కోరుకుంటున్నారు. దాయాది దేశం పాకిస్థాన్ కు చెందిన లెజెండరీ క్రికెటర్ వసీం అక్రమ్ కూడా కోహ్లీ తిరిగి ఫామ్ లోకి వస్తే చూడాలని ఉందని చెప్పుకొచ్చారు.
కోహ్లీ చెత్త ఫామ్ గురించి వసీం అక్రమ్ మాట్లాడుతూ.. అభిమానుల విమర్శలు అనవసరం అని పేర్కొన్నాడు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. విరాట్ కోహ్లీ ఈ యుగంలోనే కాదు.. అన్ని కాలాలలో గొప్ప ఆటగాళ్లలో ఒకడు. అతను ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నాడు. అతను భారత జట్టులోని అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడని స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో అక్రమ్ అన్నారు. గత కొద్ది కాలంగా అతడిపై విమర్శలు వస్తుండడం చూస్తున్నానని, భారత్ ఫ్యాన్స్ తో పాటు, మీడియా కూడా కోహ్లీపై ఏదో ఒకటి అనవసరంగా మాట్లాడడం అలవాటైపోయిందని అన్నారు అక్రమ్. కోహ్లీ వయసు కేవలం 33 ఏళ్లేనని, ఆధునిక తరం అత్యుత్తమ క్రికెటర్లలో కోహ్లీ ఒకడని.. అన్ని ఫార్మాట్లలో కోహ్లీ సగటు 50 అని, ఇప్పటికీ ఫిట్ గానే ఉన్నాడని అక్రమ్ చెప్పుకొచ్చారు. ఫాం అనేది తాత్కాలికమని, క్లాస్ ముఖ్యమని.. కోహ్లీ గొప్ప ఆటగాడు అనడంలో సందేహంలేదని, తప్పకుండా ఫాంలోకి వస్తాడని, అయితే అది పాకిస్థాన్ తో మ్యాచ్ కాకూడదని కోరుకుంటున్నానని నవ్వుతూ అన్నారు. కోహ్లి, పాక్ కెప్టెన్ బాబర్ ఆజంను పోల్చడం సహజమైనదని అభిప్రాయ పడ్డారు. బాబర్ సరైన టెక్నిక్ తో ఆడుతున్నాడు.. అతను చాలా ఆకలితో ఉన్నాడని.. చాలా ఫిట్‌గా ఉన్నాడన్నారు. బాబర్ చాలా వేగంగా నేర్చుకుంటున్నాడని అక్రమ్ అన్నారు. అతడిని కోహ్లీతో పోల్చడం మాత్రం తొందరపాటు చర్య అని చెప్పుకొచ్చారు.