భారత్ భిన్నంగా ఆడుతోంది.. పాక్ అది గుర్తుపెట్టుకోవాలి: రోహిత్ శర్మ
మనం ప్రత్యర్థిపై దృష్టి పెట్టకూడదన్నదే నా ఆలోచన, కానీ మేము మా బెస్ట్ ఆటను కొనసాగిస్తాము.
గతేడాది టీ20 ప్రపంచ కప్ లో భారత్ పాకిస్థాన్ చేతిలో ఘోరమైన ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే..! ఈ ఏడాది భారత్ రెండు మ్యాచ్ లు పాకిస్థాన్ తో తలపడబోతోంది. ఒకటి ఆసియా కప్ లో కాగా.. మరొకటి టీ20 ప్రపంచ కప్. ఆగస్టు 28న హై-వోల్టేజ్ ఇండియా వర్సెస్ పాకిస్థాన్ పోటీతో ఆలియా కప్ టోర్నమెంట్ ప్రారంభం అవ్వబోతోంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్‌ను గెలవాలనే ఉత్సాహంతో ముందుకు వెళుతోంది. గత ఏడాది దుబాయ్‌లో టీ20 ప్రపంచ కప్ లో 10 వికెట్ల తేడాతో పరాజయం తర్వాత టీమ్ ఇండియా తొలిసారిగా తమ చిరకాల ప్రత్యర్థితో తలపడనుంది.
అయితే రోహిత్ శర్మ మాత్రం ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉంటాయని చెప్పుకొచ్చాడు. "చాలా కాలం తర్వాత ఆసియా కప్ జరుగుతోంది, కానీ మేము గత సంవత్సరం దుబాయ్‌లో పాకిస్తాన్‌తో ఆడాము, అక్కడ ఫలితం అనుకున్నట్లుగా రాలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఆసియా కప్ వేరు. భారత జట్టు భిన్నంగా ఆడుతోంది. విభిన్నంగా సిద్ధం చేయబడింది. గత ఓటమి నుండి చాలా విషయాలు మారాయి. కానీ మేము పరిస్థితులను అంచనా వేయాలి, మేము 40-ప్లస్ డిగ్రీలలో ఆడతాము అనే వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. ఆ అంశాలన్నింటినీ బేరీజు వేసుకుని అందుకు అనుగుణంగా సిద్ధం కావాలి'' అని మీడియాతో అన్నాడు రోహిత్ శర్మ.
"మనం ప్రత్యర్థిపై దృష్టి పెట్టకూడదన్నదే నా ఆలోచన, కానీ మేము మా బెస్ట్ ఆటను కొనసాగిస్తాము. మేము వెస్టిండీస్, ఇంగ్లండ్‌తో ఆడాము.. ఈ రెండు సందర్భాల్లోనూ, మా ప్రత్యర్థి ఎవరు అని మేము ఆలోచించలేదు, కానీ మేము జట్టుగా ఏమి చేయాలి, మనం ఏమి సాధించాలి అనే దానిపై దృష్టి పెట్టాము. అదేవిధంగా, ఆసియా కప్‌లో, మా దృష్టి జట్టుగా ఏమి సాధించాలనే దానిపైనే ఉంటుంది. మనం ఎవరితో తలపడుతున్నామన్నది కాదు.. అది పాకిస్తాన్, బంగ్లాదేశ్ లేదా శ్రీలంక కావచ్చు "అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. "ఒక జట్టుగా, మేము ఆసియా కప్‌కు ముందు కొన్ని విషయాలపై పని దృష్టి పెట్టాము. మేము దాన్ని కొనసాగించాలి, " చెప్పాడు రోహిత్.