BiggBoss 6 Day 100 : ఆదిరెడ్డి, రోహిత్ లను పొగిడేసిన బిగ్ బాస్.. జట్టుగా ఆడితే తప్పేంటి ?
కంఫర్ట్ జోన్ నుంచి వచ్చి ఏదైనా సాధించడానికి ధైర్యం కావాలి. అదే ధైర్యాన్ని చూపిస్తూ కంటెస్టెంట్లుగా మారిన భార్యా భర్తలుగా
బిగ్ బాస్ సీజన్ 6.. గ్రాండ్ ఫినాలేకి ఇంకా నాలుగు రోజులే సమయం. హౌస్ లో ఆరుగురున్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందన్నారు కానీ.. ఇంతవరకూ దానిపై అప్డేట్ లేదు. ఈ రోజు లేదా రేపటి ఎపిసోడ్ లో ఎలిమినేషన్ జరగవచ్చు అని తెలుస్తోంది. ఇక హౌస్ లో ఫినాలే వీక్ కాబట్టి.. ఇంటిసభ్యుల జర్నీలను బిగ్ బాస్ చూపిస్తున్నాడు అందులో భాగంగా మంగళవారం నాటి ఎపిసోడ్ లో.. రోహిత్, ఆదిరెడ్డిల జర్నీని చూపించారు. దానికంటే ముందు హౌస్ లో వాళ్లిద్దరి ఆటతీరుపై బిగ్ బాస్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఆదిరెడ్డితో కవిత, రోహిత్ తో మెరీనా మాట్లాడారు. గార్డెన్ ఏరియాలోకి వచ్చిన రోహిత్ గురించి బిగ్ బాస్ మాట్లాడుతూ..
''మొసలి నీటిలో ఉన్నప్పుడు తన బలాన్ని స్వేచ్ఛగా ప్రదర్శిస్తుంది. అదే నేలపై మాత్రం ఒక్క అడుగు వేయాలన్న ఆలోచిస్తుంది. కంఫర్ట్ జోన్ నుంచి వచ్చి ఏదైనా సాధించడానికి ధైర్యం కావాలి. అదే ధైర్యాన్ని చూపిస్తూ కంటెస్టెంట్లుగా మారిన భార్యా భర్తలుగా మీరు బిగ్‌బాస్ ఇంటిలోకి అడుగుపెట్టారు. ఎదురయ్యే సవాళ్లను, కష్టసుఖాలను పంచుకోవడం కేవలం జీవితభాగస్వామితోనే సాధ్యం. ఆ తోడు మీకు ఈ ఇంట్లో లభించింది. మిగతా ఇంటి సభ్యులు ఇదే విషయంపై మిమ్మల్ని తరచూ నామినేట్ చేస్తూ వచ్చారు. స్నేహితులు జట్టుగా ఆడితే తప్పులేనిది, మీరిద్దరూ ఆడితే ఎందుకు చర్చనీయాంశం అయ్యింది? భార్యాభర్తలకు మించిన స్నేహితులు ఉంటారా? అనే భావన కలిగింది. అయినా మీరు అవేవీ లెక్క చేయలేదు. సహనాన్ని కోల్పోలేదు. విడివిడి ఆడుతున్నప్పటి నుంచి మీ వేగం పెరిగింది. మరానీ ఇంటికి వెళ్లిపోయినప్పుడు మీ పడవపై మీరొక్కరే మిగిలారు. కష్టం వచ్చినప్పుడు మీ మౌనాన్నే ఆయుద్ధంగా వాడారు. ఇది అనవసరమైన వాటి నుంచి మిమ్మల్ని దూరం చేసింది. ఆట మీద దృష్టి పెట్టే మానసిక ధైర్యాన్ని ఇచ్చింది. మీ మంచితాన్ని ఇతరులు అవకాశంగా తీసుకున్నా, మీరు వారికి మంచి చెయ్యడానికే నిర్ణయించుకున్నారు. మీ అమ్మగారు మిమ్మల్ని కెప్టెన్ గా చూడాలనే కోరిక అసంపూర్ణంగా మిగిలిపోయినా, ఈ స్థానంలో మిమ్మల్ని చూసి గర్వపడతారు'' అని బిగ్ బాస్ చెప్పగానే.. ఇంతవరకూ అంతగా ఎమోషనల్ అవని రోహిత్.. కంటతడి పెట్టుకున్నాడు. ఆ తర్వాత హౌస్ లో రోహిత్ జర్నీని చూపించారు.
నెక్ట్స్ ఆదిరెడ్డిని గార్డెన్ ఏరియాలోకి పిలిచారు. ఆదిరెడ్డి గురించి బిగ్ బాస్ మాట్లాడుతూ.. ''ఒక సామాన్యుడిగా ఆసక్తితో బిగ్ బాస్ రివ్యూవర్‌గా మారారు. ఇప్పుడు కంటెస్టెంట్‌గా మీ ప్రయాణం చివరి వారానికి చేరింది. ఇంట్లోకి రాకముందే ఆట గురించి ఎన్నో లెక్కలు వేసి, ఇంట్లోకి అడుగుపెట్టగానే మీలోని స్ట్రాటజీ మాస్టర్ చురుకయ్యారు.కొన్నిసార్లు మీ అంచనా తప్పి మీకే నష్టం జరిగింది. అలాగే మీలోని ఒక సామాన్యుడిని కూడా కొన్నిసార్లు బయటపెట్టారు. మీరు చేసిన డ్యాన్సు కూడా అందులో ఒకటి. మీలో మీకు తెలియని కోణాన్ని ఈ ఇల్లు ప్రేక్షకులకు పరిచయం చేసింది. సామాన్యుడిగా మొదలై విజేతగా నిలిచేందుకు ఒక అడుగు దూరంలో ఉన్న మీ ప్రయాణం ఆగకూడదని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్'' అని చెప్తాడు బిగ్ బాస్. ఆ తర్వాత ఆదిరెడ్డి.. బిగ్ బాస్ లేకపోతే నేను లేనంటూ తన ప్రసంగం మొదలుపెట్టాడు. హౌస్ లో ఆదిరెడ్డి జర్నీని ప్లే చేశాడు బిగ్ బాస్.