నాలుగేళ్ల కన్న కొడుకును కిరాతకంగా చంపి.. బ్యాగులో కుక్కి
బెంగళూరుకు చెందిన సుచనా సేత్ తన నాలుగేళ్ల కుమారుడిని గోవాలో హత్య చేసింది
తల్లి అంటే త్యాగం.. ప్రేమ.. ఆప్యాయత... అమ్మ అంటే అనురాగం. ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ అనే పదానికి మరో పదం సాటి రాదు. అలాగే అమ్మకు మరెవరూ ఈ లోకంలో సరిపోరు. మాతృహృదయం ఎప్పుడూ తన బిడ్డ చల్లగానే ఉండాలని కోరుకుంటుంది. పశుపక్షాదుల నుంచి మానవుల వరకూ తల్లి ప్రేమను తనివి తీరా చూస్తుంటాం. తల్లి ప్రేమగా చెప్పే కథలు చిన్నప్పటి నుంచి వింటుంటూనే ఉంటాం. కానీ కానీ తల్లుల్లోనూ కసాయి మాతలు ఉన్నారని కొన్ని సందర్భాల్లో బయటపడటం సమాజంలో హెచ్చుమీరుతున్న పెడధోరణలకు అద్దం పడుతుంది.
బెంగళూరుకు చెందిన...
తన కుమారుడి కాలికి చిన్న గాయం అయితేనే చాలు ఆ తల్లి మనసు విలవిలలాడిపోతుంది. ఆ గాయం మానేంత వరకూ ఆ తల్లి కడుపులో పెట్టుకుని కన్నపేగును కాపాడుకుంటూనే ఉంటుంది. కానీ బెంగళూరుకుచెందిన ఒక ఐటీ కంపెనీ సీఈవో మాత్రం తన కుమారుడిని చంపేసింది. హత్య చేసి మాతృత్వానికే కళంకం తెచ్చింది. బెంగళూరుకు చెందిన సుచనా సేత్ ఒక స్టార్టప్ కంపెనీకీ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. బెంగళూరు నుంచి తన నాలుగేళ్ల కుమారుడిని గోవాకు తీసుకెళ్లిన సుచనా సేత్ అక్కడ హోటల్ లో తన నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసింది.
కారులో బెంగళూరుకు...
హత్య చేసిన అనంతరం కుమారుడి మృతదేహాన్ని బ్యాగులో పెట్టుకుని గోవా నుంచి బెంగళూరుకు మృతదేహంతో కారులో బయలుదేరింది. అయితే హోటల్ ను శుభ్రపర్చేందుకు వచ్చిన సిబ్బంది గదిలో ఉన్న రక్తపు మరకలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. హోటల్ లోకి వెళ్లేముందు కుమారుడితో వెళ్లిన సుచనా సేత్ ఖాళీ చేసి బయటకు వచ్చేటప్పుడు ఒంటరిగా వెళ్లడం గమనించిన పోలీసులు అనుమానం వచ్చి కారు డ్రైవర్ కు ఫోన్ చేసి వెనక్కు రప్పించారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే హత్య ఎందుకు చేసిందన్న కారణాలు మాత్రం తెలియరాలేదు.