రీల్ సీన్ రియలైంది.. చనిపోయిన బాలింతకు చికిత్స చేసిన వైద్యులు
తలకొండపల్లి మండలంలోని ఓ తండాకు చెందిన గిరిజన మహిళ నెలలు నిండడంతో ప్రసవం కోసం ఆమనగల్లులోని..
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా గుర్తుంది కదూ. 2003, సెప్టెంబర్ 24న విడుదలైన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. వైద్యం పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులు చనిపోయినవారికి కూడా చికిత్స చేసి.. పేదవాళ్లని ఎలా దోచుకుంటున్నాయో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆ సినిమాలో.. చనిపోయిన వ్యక్తికి చికిత్స ఇస్తున్నట్టు నమ్మిస్తూ లక్షలకు లక్షలు కట్టించుకుంటారు. ఇప్పుడు అదే సీన్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రియల్ గా జరిగింది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. తలకొండపల్లి మండలంలోని ఓ తండాకు చెందిన గిరిజన మహిళ నెలలు నిండడంతో ప్రసవం కోసం ఆమనగల్లులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఆపరేషన్ ద్వారా ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. కాసేపటికే అనారోగ్యంతో మరణించింది. వైద్యులు ఆ విషయాన్ని దాచిపెట్టి.. ఆమెకు మరింత మెరుగైన చికిత్స చేయాల్సి ఉందని.. అదేరోజు రాత్రి హైదరాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ మృతురాలికి వైద్యం చేస్తున్నట్లు నటిస్తూ.. కోలుకుంటోందని బంధువులను నమ్మించారు. కొద్దిసేపటికి వైద్యులు వచ్చి తమ ప్రయత్నం విఫలమైందని, ఆమె మరణించిందని తెలిపారు.
బాధిత మహిళ కుటుంబ సభ్యులకు అక్కడే అనుమానం వచ్చింది. కోలుకుంటుందని చెప్పి.. మళ్లీ చనిపోయిందని చెప్పడంతో వైద్యులను నిలదీశారు. కుటుంబ సభ్యులు గొడవకు దిగడంతో ఆమనగల్లు ఆసుపత్రి యాజమాన్యం దిగొచ్చింది. గొడవ మరింత పెద్దదై బయటకు రాకుండా కప్పిపుచ్చేందుకు బాధిత కుటుంబ సభ్యులతో ఒప్పందం కుదుర్చుకుంది. రూ. 8 లక్షలు ఇస్తామని ఒప్పందం పత్రం రాసి ఇచ్చినట్టు తెలుస్తోంది.