ఫ్యాక్ట్ చెక్: ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌కమల్ దాస్ అనే వ్యక్తికి ఒకే ఇంట్లో 43 మంది కుమారులు ఉన్నారనే వదంతుల్లో అసలు నిజం ఇదే
నకిలీ ఓటరు కార్డులు, ఓటర్ల తొలగింపు అంశాలపై ప్రతిపక్షాలు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలో;

Ram Kamal Das
నకిలీ ఓటరు కార్డులు, ఓటర్ల తొలగింపు అంశాలపై ప్రతిపక్షాలు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఆధార్ నంబర్లు, ఫోన్ నంబర్లను ఓటర్ల జాబితా డేటాతో అనుసంధానించాలని అధికారులను ఆదేశించింది.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. అందరి తండ్రిగా ఆ లిస్టులో ఉన్న వ్యక్తి వారందరికీ గురువు. ఆయన రామ జానకి మఠం ప్రధాన పూజారి.మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి చిత్రాన్ని తనిఖీ చేసినప్పుడు, 2023 సంవత్సరంలో ప్రచురించిన వార్తా నివేదికలను కనుగొన్నాము. పాత కధనాల ప్రకారం 2023 లో ఆయన తండ్రిగా 48 మంది నమోదు చేసుకున్నారు.
ఈటీవీ భారత్ ప్రచురించిన నివేదిక ప్రకారం, వారణాసిలోని 51వ వార్డు నంబర్ ఓటరు జాబితా చిత్రం ఇదని తేలింది. ఒక వ్యక్తి 48 మంది కుమారుల తండ్రిగా చూపించారు. వైరల్ ఓటరు జాబితాలో చూపబడిన 48 మంది కుమారుల తండ్రి ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. కానీ, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఓటరు జాబితా కూడా అధికారికంగా సరైనదని నిర్ధారించారు.
వారణాసిలోని 51వ వార్డు నంబర్ ఓటరు జాబితా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో 13 మంది పిల్లలకు 37 సంవత్సరాలు, ఐదుగురు 39 సంవత్సరాలు, నలుగురికి 40 సంవత్సరాలు, మరొకరికి 42 సంవత్సరాలు.
జాగ్రన్ నివేదిక ప్రకారం, మున్సిపల్ ఎన్నికల మొదటి దశలో గురువారం నాడు భేలుపూర్ లోని వార్డు నెం.51 ఓటర్ల జాబితా చర్చనీయాంశంగా మారింది. భేలుపూర్ లోని వార్డు నెం.51లోని ఖోజ్వాన్-కాశ్మీరీగంజ్ ఓటర్ల జాబితాలో, 48 మంది ఓటర్ల తండ్రి పేరు రామ్ కమల్ దాస్ గా నమోదు చేశారు. ఓటర్ల వయస్సు భిన్నంగా ఉంది, కానీ చిరునామా ఒకటే - ఇంటి నంబర్ B, 24/19. ఈ వార్త ఆన్ లైన్ లో విపరీతంగా వ్యాపించింది. ఎస్పీ కూడా దీనిని పరిగణనలోకి తీసుకుని విచారణ చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారిని కోరారు. అయితే, నిజం తెలిసిన వెంటనే అందరూ సైలెంట్ అయిపోయారు. నిజానికి, స్వామి రామ్ కమల్ దాస్ వేదాంతి రామ్ జానకి మఠం ఖోజ్వాన్ ప్రధాన పూజారి. గురు-శిష్య సాధువు సంప్రదాయంలో చేరిన తర్వాత శిష్యుల పేరు దగ్గర తండ్రి పేరు స్థానంలో గురువు పేరు రాశారని మఠం మేనేజర్ రాంభరత్ శాస్త్రి వివరించారు. గతంలో, స్వామి జీ పేరు 150 మందికి తండ్రిగా నమోదు చేశారు. ఇప్పుడు ఈ సంఖ్య 48కి తగ్గింది.