ఫ్యాక్ట్ చెక్: 2017లో టీడీపీ హయాంలో ఇచ్చిన సైకిళ్ళను ఇప్పటివి అంటూ ప్రచారం చేస్తున్నారు
2017లో టీడీపీ హయాంలో ఇచ్చిన సైకిళ్ళ ఫోటోలు ఇవి;

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అసెంబ్లీలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. పబ్లిసిటీ పిచ్చితో పిల్లలకు ఇచ్చే బ్యాగులపై కూడా వైఎస్ జగన్ బొమ్మ వేయించుకున్నారంటూ నారా లోకేష్ విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు సరఫరా చేసే స్టేషనరీ సామాగ్రిపై జగన్ తన ఫోటోలను ముద్రించుకున్నారని అన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసే వేరుశనగ బర్ఫీ, స్కూల్ బ్యాగ్, నోట్ పుస్తకాలు, గుడ్లను కూడా లోకేష్ అసెంబ్లీకి తీసుకువచ్చారు. స్కూల్ బ్యాగులపై, విద్యార్థులకు ఇచ్చే నోట్‌బుక్‌లపై కూడా జగన్ చిత్రాలను ఉంచారన్నారు.
ఏపీలో విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నుంచి స్కూల్ యూనిఫామ్ మారనుందని నారా లోకేష్ తెలిపారు. స్కూల్ విద్యార్థులు కొత్త యూనిఫామ్‌లకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆమోదం తెలిపారు. ఏ పొలిటికల్ పార్టీలకు సంబంధించిన రంగులు, గుర్తులు లేకుండా విద్యార్థులకు స్కూల్ యూనిఫాం రూపొందించినట్లు తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్‌లో భాగంగా స్టూడెంట్లకు కూటమి ప్రభుత్వం యూనిఫామ్, బ్యాగు, బెల్ట్ అందించనుంది.
నారా లోకేష్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కొన్ని సోషల్ మీడియా ఖాతాలలో పోస్టులు వచ్చాయి. విద్యార్థులకు ఇచ్చిన సైకిళ్ళపై చంద్రబాబు నాయుడు బొమ్మ ఉందని చెబుతూ పోస్టులు పెట్టారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న సైకిల్ కు సంబంధించిన ఫోటోలు ఇటీవలివి కాదు. 2017 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసిన ఫోటోలు.
ఇటీవలి కాలంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైకిళ్లను విద్యార్థులకు ఇచ్చారా అని తెలుసుకోడానికి మేము గూగుల్ సెర్చ్ చేశాం.. అయితే ఎక్కడా కూడా ఆయన సైకిళ్లను విద్యార్థులకు అందించిన కథనాలు మాకు కనిపించలేదు.
ఒకవేళ సీఎం చంద్రబాబు అలాంటి కార్యక్రమంలో పాల్గొని ఉండి ఉంటే అది తప్పనిసరిగా వార్తల్లో నిలిచి ఉండేది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఇంకా అలాంటి ప్రోగ్రామ్ లను మొదలుపెట్టలేదు.
ఇక మేము యూట్యూబ్ లో చంద్రబాబు సైకిల్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ కోసం వెతికాం. మాకు పలు మీడియా సంస్థలకు సంబంధించిన కథనాలు లభించాయి.
AP CM Chandrababu Naidu Distributes Cycles to Girl Students | Jordar News | HMTV అనే టైటిల్ తో HMTV యూట్యూబ్ ఛానల్ లో పోస్టు చేసిన వీడియో మాకు లభించింది. ఏప్రిల్ 18, 2017న ఈ వీడియోను పోస్టు చేశారు. చంద్రబాబు నాయుడు బాలికలకు సైకిళ్లను అందించారని ఈ కథనం ద్వారా తెలుస్తోంది.
వైరల్ ఫోటో లోని సైకిళ్ళ రంగు, మోడల్.. ఈ వీడియోలోని సైకిళ్ళ రంగు, మోడల్ ఒకటేనని తెలుస్తోంది.
అదే కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ఏప్రిల్ 17, 2017న ETV Andhra Pradesh యూట్యూబ్ యూట్యూబ్ వీడియోను మేము చూశాం. విజయవాడలో నిర్వహించిన బడికొస్తా కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు సైకిళ్లను పంచారని ఈ వీడియో నివేదికలు చెబుతున్నాయి.
CM distributes cycles to girl students అంటూ ది హిందూలో ప్రచురితమైన కథనం కూడా మాకు లభించింది. ఇందులో ప్రచురితమైన ఫోటోలో కూడా వైరల్ పోస్టులోని సైకిల్ ను పోలి ఉంది.
వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా చంద్రబాబు నాయుడు అధికారిక ఖాతాలో పోస్టు చేసిన ఫోటోలలో వైరల్ ఫోటోతో పూర్తిగా మ్యాచ్ అయ్యే ఫోటో కూడా మాకు లభించింది.
ఈ ఆధారాలన్నీ బట్టి 2017 ఏప్రిల్ నెలలో 'బడికొస్తా' ప్రోగ్రామ్ లో జరిగిన సైకిళ్ల పంపిణీ ఫోటోలను ఇటీవలివిగా పోస్టు చేశారు.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.
Claim : 2017లో టీడీపీ హయాంలో ఇచ్చిన సైకిళ్ళ ఫోటోలు ఇవి
Claimed By : Social Media Users
Fact Check : False