మోడీ- షా ద్వయం రంగంలోకి దిగిందంటే ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టాల్సిందే. ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ విజయం ఖాయం.. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను మట్టికరిపిస్తూ ముందుకు దూసుకెళ్లడంలో ఆ ద్వయానికి సాటిలేదు... ఇప్పుడీ ద్వయం ప్రాభవం కోల్పోతోందా..? ఈ ఘనతంతా గతంగా మిగిలిపోతుందా..? నలువైపులా చుట్టుముడుతున్న అనేక సవాళ్లను ఎదుర్కోలేక తడబడుతోందా..? అంటే ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు ఔననే అంటున్నాయి. పలు రాష్ట్రాల్లో మెజారిటీ రాకున్నా తమ వ్యూహంతో ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ అధికారం చేజిక్కించుకున్న మోడీ-షా ద్వయం ఇటీవల మాత్రం కనీస ప్రభావం చూపలేక తడబడుతోందని అనేకంటే చడీచప్పుడు లేకుండా ఉండిపోతోందని అనడమే కరెక్ట్.
ఉప ఎన్నికల నుంచే....
రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో జరిగిన లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలించి. ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా రెండు స్థానాల్లో బీజేపీ ఘోర ఓటమిని చవిచూసింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ పలుమార్లు ప్రాతినిథ్యం వహించిన గోరఖ్‌పూర్ నియోజకవర్గంలో కూడా ఆ పార్టీ అభ్యర్థి ఓటమిపాలయ్యారు. సీఎం ఆదిత్యనాథ్‌తో పాటు డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య రాజీనామా చేసిన ఫుల్ఫూర్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు.
యోగీకి ఫుల్లు క్లాస్.....
ఉత్తరప్రదేశ్‌లో ఎస్‌పీ, బీఎస్‌పీలు కలిసి నడిచి బీజేపీని దెబ్బకొట్టాయి. ఉత్తరప్రదేశ్‌లో తిరుగులేదని చెప్పుకుంటున్న దశలో ఉపఎన్నికలు ఊహించని షాక్ ఇచ్చాయి. వచ్చే ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలతో పాటు కాంగ్రెస్ కూడా జత కలిస్తే యూపీలో బీజేపీ పని ఖేల్ ఖతం. ఇది బీజేపీని తెగ టెన్షన్ పెడుతోంది. ఇదే సమయంలో దళితుల సమస్యలను పరిష్కరించడంలో యోగి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నారని, దళితులను పట్టించుకోవడంలేదనీ సొంత పార్టీకి చెందిన నలుగురు దళిత ఎంపీలు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఇద్దరు పార్టీ అధిష్టానానికి లేఖలు కూడా రాశారు. ఇక్కడ విషయమేమంటే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై మోడీ, షాలు సీఎం యోగిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ పరిణామాలన్నీ కూడా మోడీ-షా ద్వయం ప్రాభవాన్ని కోల్పోయేలా చేస్తున్నాయనీ పలువురు నాయకులు అంటున్నారు. తాజాగా మోడీ ముఖ్యమంత్రి యోగిని ఢిల్లీకి పిలిచి మరీ ఫుల్ క్లాస్ పీకారు. అక్కడ పరిస్థితిని చక్కదిద్దేందుకు అమిత్ షాను లక్నోకు పంపుతున్నారు.
పార్లమెంట్ సమావేశాల్లోనూ....
ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాలు వృథా అయ్యాయనే భావన ప్రజల్లో ఉంది. సమావేశాలను సమర్థవంతంగా నిర్వహించడంలో మోడీ విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి, ఎన్డీయే నుంచి ప్రధాన మిత్రపక్షం టీడీపీ బయటకు వచ్చింది. అనంతరం వైసీపీ, టీడీపీలు ఏకంగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నం చేశారు.
అదే సీన్....వాయిదాల పర్వం.....
రోజూ ఆయా పార్టీలు స్పీకర్‌కు అవిశ్వాస తీర్మానాలు అందించడం, కావేరి జలబోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే, రిజర్వేషన్ల అమలు అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలని టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనలు చేయడం.. స్పీకర్ సభను వాయిదా వేయడం.. ఈ సమావేశాల్లో రెండు సభల్లోనూ ఇదే సీన్ తప్ప మరొకటి కనిపించలేదు ప్రజలకు. మోడీ మాత్రం చూస్తూ ఉండి పోయారు తప్ప ఆందోళన చేస్తున్న వారిని పిలిచిమాట్లాడలేదు. కనీసం సమాధానం చెప్పలేదు. అవిశ్వాసానికి భయపడి పారిపోయారనే అపవాదును మోడీ-షా ద్వయం మూటగట్టుకుంది.
అన్నింటా ఎదురుదెబ్బే....
ఇక రాజస్థాన్‌లోనూ రెండు సిట్టింగ్ ఎంపీ సీట్లు కోల్పోయిన బీజేపీ, బిహార్‌లో నితీష్‌తో జత కట్టినా అక్కడ అరారియా లోక్‌సభ సీటులో ఓడింది. ఇక ప్రస్తుతం ఎన్నికలు జరుగుతన్న కర్ణాటకలో ఏటికి ఎదురీదుతోంది. త్వరలో ఎన్నికలు జరిగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌లోనూ ఆ పార్టీ గెలుపు కష్టమే అని జాతీయ రాజకీయ వర్గాలు చెపుతున్నాయి. ఇటు నమ్మకమైన మిత్రపక్షాలు దూరమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు మిత్రపక్షాలు మోడీని ప్రత్యక్షంగా విమర్శించడం.. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతుండడం మోడీ-షాల ద్వయం ప్రాభవం కోల్పోతుందనడానికి నిదర్శనమని పలువురు నాయకులు అంటున్నారు.