Revanth Reddy : రేవంత్ రెడ్డి పుణ్యమే... రేవతి కుటుంబానికి ఆ మాత్రం?
సంథ్య థియేటర్ లో మహిళ మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నందునే ఆ కుటుంబానికి కొంత ప్రయోజనం చేకూరింది.
సంథ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నందునే ఆ కుటుంబానికి కొంత ప్రయోజనం చేకూరింది. అందులో వాస్తవముంది. లేకుంటే వారిని పట్టించుకునే వారుండకపోదురు. ఏదో సినిమా వాళ్లు అలా అరకొర సాయం అందించి చేతులు దులుపుకునే వారు. ప్రశ్నించే వారు కూడా ఎవరూ ఉండరు. గతంలోనూ ఇలాగే అనేక ఘటనలు జరిగినప్పటికీ ఇంత పెద్ద స్థాయిలో ఒక మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందించలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జరిగిన ఘటన దురదృష్టకరమే అయినా... రేవతి తొక్కిసలాటలో మరణించడం ఆ కుటుంబానికి ఎవరూ తీర్చలేని లోటు అని అందరూ అంగీకరిస్తారు.
గతంలో ఇలాంటి ఘటనలకు...
కానీ గతంలో అనేక ఘటనలు జరిగినా పెద్దగా పట్టించుకోలేదు. పది లక్షలకు మించి పెద్దగా ఆర్థిక సాయాన్ని కూడా అందించలేదు. అయితే సంథ్యాథియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించిన తర్వాత రేవంత్ రియాక్ట్ అయిన తీరుతోనే ఈ మాత్రం సాయం ఆ కుటుంబానికి అందిందనే చెప్పాలి. లేకుంటే గాయపడిన ఆ బాలుడి వైద్య చికిత్సకోసం అయ్యే ఖర్చును కూడా ఎవరూ భరించడానికి ముందుకు వచ్చేవారు కాదు. మూవీ సక్సెస్ ను యూనిట్ ఎంజాయ్ చేసేది. అల్లు అర్జున్ నుంచి కూడా ఇంత పెద్ద మొత్తం ఇచ్చే వారు కాదు. అలాగే నిర్మాతలు కూడా గతంలో ఎప్పుడూ ఇంత పెద్దమొత్తంలో యాభై లక్షల వరకూ పరిహారం ఇచ్చిన ఘటనలు అరుదుగానే చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ యాభైలక్షలు, అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షలు ఇప్పటికే ప్రకటించారు.
ప్రభుత్వం పాతిక లక్షలు...
ఇందులో అల్లు అర్జున్ నుంచి తనకు పది లక్షలు మాత్రమే అందాయని రేవతి భర్త భాస్కర్ చెబుతున్నారు. అదే సమయంలో అల్లు అర్జున్ కూడా తాను పెద్దమొత్తంలో ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నానని మీడియా సమావేశంలో చెప్పడంతో మరికొంత నగదును ఆ కుటుంబానికి ఇచ్చే అవకాశముంది. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం నుంచి ప్రకటించారు. వైద్యఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. వెనువెంటనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లి చెక్కును అందించారు. తర్వాత వరసగా అందరూ పరిహారం అందించేందుకు సిద్ధమయ్యారు. ఫిలిం ఫెడరేషన్ కూడా వారికి ఆర్థిక సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. రేవతి భర్త భాస్కర్ కు సినిమా ఇండ్రస్ట్రీలో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇలా రేవంత్ రియాక్షన్ గట్టిగా ఉండటం వల్లనే ఆ కుటుంబానికి ఆమాత్రం న్యాయమైనా జరిగింది. లేకుంటే మాత్రం అనాధలా వారి మానాన వారిని వదిలేసేవారే. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now