Summer Effect : మార్చి నెల నుంచే మండుతున్న సూరీడు
మార్చి నెల నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి;

మార్చి నెల నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేసవి కాలం ముందే వచ్చేసింది. మార్చి నెల ఆరంభం నుంచే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మూడు నెలలు కష్టమేనని చెప్పింది. ప్రస్తుతం 38.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఇక మే నెలలో నలభై ఐదు డిగ్రీలు దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
అధిక ఉష్ణోగ్రతలు...
అనేక ప్రాంతాల్లో సాధరణం కంటే నాలుగైదు డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక వాడగాల్పులు కూడా ప్రారంభమయ్యాయి. ఉదయం వేళ కొంత చల్లగాలులు వీస్తున్నా ఉదయం పది గంటల నుంచి మాత్రం వేడిగాలుల తీవ్రత ప్రారంభం అవుతుండటంతో వడదెబ్బ తగిలే అవకాశముందని వాతారణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే మూల్యంచెల్లించుకోవాల్సి ఉంటుందని, ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండల తీవ్రత కారణంగా అనేక వ్యాధులు సంక్రమించే అవకాశముందని, డీహైడ్రేషన్ కు లోను కాకుండా ప్రజలు తరచూ నీటిని తాగుతూ ఉండాలని సూచిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో...
తెలంగాణలోనూ హైదరాబాద్ నగరం ఉదయం పది గంటలకే వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారు ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ప్రజలు ఇప్పటికే అనేక వ్యాధులు బారిన పడి ఆసుపత్రులలో చేరుతున్నారని వైద్యులు చెబుతున్నారు. తీవ్రమైన జ్వరంతో పాటు జలుబు, దగ్గు, ఒళ్లునొప్పుల వంటి వాటితో వస్తున్నారని, కొందరు జ్వరంతో స్పృహకోల్పోతున్నారని కూడా చెబుతున్నారు. ఎండల తీవ్రతకు వ్యాపారాలు దెబ్బతినడంతో చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. ఆహార విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.