హైదరాబాద్ లో ముగిసిన ఫార్ములా-ఈ రేసింగ్.. విజేత అతనే..

అట్టహాసంగా ప్రారంభమైన ప్రతిష్టాత్మక ఫార్ములా-ఈ ప్రపంచ రేసింగ్ చాంపియన్ షిప్ ముగిసింది.

Update: 2023-02-11 11:43 GMT

formula e race hyderabad winner

ఫార్ములా-ఈ రేసింగ్ కు భాగ్యనగరంలో నెక్లెస్ రోడ్ వేదికైంది. ఈరోజు ఉదయం అట్టహాసంగా ప్రారంభమైన ప్రతిష్టాత్మక ఫార్ములా-ఈ ప్రపంచ రేసింగ్ చాంపియన్ షిప్ ముగిసింది. భారత్‌లో తొలిసారి హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న రేసింగ్‌లో ప్రపంచస్థాయి రేసర్లు అదరగొట్టారు. శనివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ప్రారంభమైన రేసు గంటన్నర పాటు జరిగింది. ఫార్ములా-ఈ రేస్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతగా జీన్‌ ఎరిక్‌ వెర్గ్‌నే(డీఎస్‌ పెన్‌స్కే రేసింగ్‌) నిలిచాడు. ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఫార్ములా-ఈ ఛాంపియన్‌ అయిన జీన్.. తాజా విజయంతో.. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు.

జీన్ తర్వాత.. రెండో స్థానంలో నిక్‌ క్యాసిడీ(ఎన్‌విజన్‌ రేసింగ్‌), మూడో స్థానంలో సెబాస్టియన్‌ బ్యూమి(ఎన్‌విజన్‌ రేసింగ్‌) ఉన్నారు. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో రేసర్లు దూసుకెళ్లారు. 2013లో ఫార్ములా-1 రేసు తర్వాత భారత్‌లో జరుగుతున్న ఫార్ములా-ఈ తొలి రేసుకు మన హైదరాబాద్‌ వేదికైంది. ఇప్పటి వరకు ఫార్ములా-ఈ రేసుకు ఆతిథ్యమిచ్చిన నగరాల్లో హైదరాబాద్ 27వ నగరంగా చోటు దక్కించుకుంది. హుసేన్ సాగర్ చుట్టూ.. 2.8కిలోమీటర్ల నిడివితో ప్రత్యేకంగా నిర్మించిన సర్క్యూట్‌పై మొత్తం 11 జట్లు పాల్గొన్నాయి. రేసింగ్ లో విదేశీ కంపెనీలదే హవా అయినా.. మనదేశం నుండీ మహీంద్ర రేసింగ్‌, టీసీఎస్‌ జాగ్వార్‌ బరిలోకి దిగడం గర్వకారణం. ఈ రేసింగ్ ను వీక్షించేందుకు పలువురు సెలబ్రిటీలు విచ్చాశారు.
జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు ల సతీమణులైన లక్ష్మీప్రణతి, నమ్రతా శిరోద్కర్, నారా లోకేష్ భార్య నారా బ్రహ్మణి, అలాగే ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, మంత్రి కేటీఆర్, రామ్చరణ్, శిఖర్ ధావన్ తదితరులు రేసింగ్ చూసేందుకు విచ్చేశారు. వీరిరాకతో రేసింగ్ ప్రాంతం కోలాహలంగా మారింది.


Tags:    

Similar News