Mangos: ఇదేందయ్యా..సీజన్ ఏంది..ఈ మామిడిపండ్లు ఏంటి?

హైదరాబాద్ లోనూ మామిడిపండ్లు దర్శనమిస్తున్నాయి. వాటి కొనుగోలుకు వ్యాపారులు పోటీ పడుతున్నారు;

Update: 2025-01-02 05:31 GMT

అనేక రకాలు పండ్లు సీజనల్ గా వస్తుంటాయి. కొన్నిపండ్లు మాత్రం సీజన్ తో్ నిమిత్తం లేకుండా వస్తుంటాయి. అయితే పండ్లలో రారాజు అయిన మామిడిపండ్లు సీజన్ గానే వస్తాయి. ప్రతి ఏడాది మామిడి పండ్లు మేనెలలో వచ్చి జులై వరకూ వస్తూనే ఉంటాయి. మామిడిపండు అంటే పడని వారుండరు. అదే సమయంలో షుగర్ పేషెంట్లు కూడా మామిడి పండ్లను ధైర్యంగా తినేస్తుంటారు. ఎందుకంటే .. మామిడి రుచి అలాంటిది. అనేక రకాలైన మామిడిపండ్లు మన చవలూరించేందుకు సిద్ధమయిన వేళ అందరూ అటు వైపు చూస్తారు. ఎందుకంటే ఎర్రటి మండే ఎండల్లో మామిడిపండ్లను తింటే ఆ మజా వేరేగా ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా మామిడిపండ్లను లాగేస్తుంటారు.

సీజన్ తో సంబంధం లేకుండా...
అయితే ఇప్పుడు మామిడి పండ్లకు కూడా సీజన్ పోయిందనే చెప్పాలి. తాజాగా హైదరాబాద్ లోనూ మామిడిపండ్లు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ మెట్ లోని బాట సింగారం గడ్డి అన్నారం మార్కెట్ లో మామిడిపండ్లు కనిపించడంతో వ్యాపారులు కూడా వాటిని కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. రెండు లోడ్ల మామిడిపండ్లు వచ్చినట్లు తెలిసింది. 160 క్వింటాళ్ల మామిడి పండ్లను కొత్త ఏడాది తొలి రోజు రావడంతో వాటిని వ్యాపారులు కొనుగోలు చేశారు.తోతాపూరి, బేనిషన్ రకాలు వచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం క్వింటాల్ ధర 1700 నుంచి 2,500 రూపాయల వరకూ హోల్ సేల్ వ్యాపారలు విక్రయిస్తున్నారట. అయినా సరే చిరు వ్యాపారులు వాటిని కొనుగోలు చేసేందుకు పోటీ పడటంతో వచ్చిన రోజే స్టాక్ ఖాళీ అయిందని చెబుతున్నారు.
ధర ఎంతైనా పెట్టి...
హైదరాబాద్ లో మామిడిపండ్లకు మంచి గిరాకీ ఉంటుంది. ధర ఎంతైనా కొనుగోలు చేసేవారుండటంతో సేల్స్ ఎక్కువగా ఉంటాయని చిరు వ్యాపారులు వాటిని కొనుగోలు చేసి వెళ్లిపోయారు. అయితే ఈ మామిడిపండ్లు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని అనంతపుం జిల్లాల నుంచి ఈ మామిడిపండ్లు వచ్చాయని హోల్ సేల్ వ్యాపారులు చెబుతున్నారు. మొన్నామధ్య విజయవాడలోనూ మామిడిపండ్లు, తాటిముంజల విక్రయం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రకాశం జిల్లా ఉలవపాడుకు చెందిన మామిడి పండ్లు మంచి రుచికరంగా ఉండటంతో విజయవాడ మార్కెట్ కు వచ్చిన వెంటనే అవి వెంటనే అమ్ముడుపోయాయి. అలాగే ఇప్పుడు హైదరాబాద్ లోనూ మామిడిపండ్ల రాకతో నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News