ఊహించని గెలుపులు.. అంచనా వేయడం కష్టమే

ఐపీఎల్‌లో తొలుత ఇబ్బంది పడిన జట్లు పుంజుకుంటున్నాయి. క్రమంగా ప్లే ఆఫ్‌ దశకు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి

Update: 2023-05-04 04:18 GMT

ఐపీఎల్‌లో తొలుత ఇబ్బంది పడిన జట్లు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. క్రమంగా కూడదీసుకుని ప్లే ఆఫ్‌ దశకు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ వంటి జట్లు తొలి నాళ్లలో తమ ఆటతో నిరాశ పరిచాయి. అభిమానులకు ఆగ్రహాన్ని కూడా తెప్పించాయి. ఎక్కువ ఓటములను మూట గట్టుకుని ఈ జట్లు పనికి రావేమో అన్న స్థితికి చేరుకున్నాయి. ఈ జట్లు ఆడుతుంటే చూడటం కూడా వేస్ట్ అని అనుకున్న వారు కూడా లేకపోలేదు. అలాంటి జట్లు క్రమంగా పుంజుకుంటున్నాయి. ఒక్కొక్క దశ చేరుకుంటూ విజయాలను సాధిస్తూ ప్లే ఆఫ్ కు చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్ కూడా...
ముంబయి జట్టు గతంలో ఎన్నడూ లేని విధంగా తొలి నాళ్లలోనే ఓటములను చవి చూసింది. తర్వాత విజయాల బాట పట్టింది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అంతే. ఢిల్లీ క్యాపిటల్స్‌లో బౌలింగ్, బ్యాటింగ్ ఇంత బలహీనమా? అన్న కామెంట్స్ వినిపించాయి. ఈ జట్టు ఆడుతుంటే చూడటం వృధా అని కూడా అనేక మంది అనుకున్నారు. టీవీలు కట్టేసి నిద్రపోయిన వాళ్లెందరో ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడితే అవతలి జట్టు గెలిచినట్లే అని భావించారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. క్రమంగా జట్టు కూడా పుంజుకుంది.
ముంబయి జట్టు...
ముంబయి జట్టు కూడా అంతే. ఒక దశలో ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్ కు చేరుకుంటుందా? అన్న అనుమానాలు కలిగాయి. కానీ ఆ అనుమానాలను పటా పంచలు చేస్తూ క్రమంగా పాయింట్ల పట్టికలో ఎగబాకుతుంది. ప్లే ఆఫ్ కు చేరుకుంటుందా? లేదా? అన్న అనుమానాలకు తెరదించుతూ ముంబయి జట్టు చెలరేగి పోతుంది. వరస విజయాలతో దూకుడు మీద ఉంది. ఇప్పుడు బౌలింగ్, బ్యాటింగ్ పరంగా స్ట్రాంగ్ గా తయారయింది. ముంబయి జట్టు ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంది. రోహిత్ శర్మ తక్కువ పరుగులకే అవుటయినా ఎంత స్కోరయినా సులువుగా సాధిస్తామని జట్టు సభ్యుల ఆట తీరు చెప్పకనే చెబుతుంది.

మారుతున్నాయ్...
ఐపీఎల్‌లో ఎప్పటికప్పుడు సీన్‌లు ఛేంజ్ అవుతున్నాయి. మొన్నటి వరకూ ఛేజింగ్ కష్టసాధ్యమని భావించే వాళ్లు. కానీ ఇప్పుడు ఎంత స్కోరు అయినా సులువుగా ఛేజ్ చేస్తున్నారు. ప్రత్యర్థి జట్టును తక్కువగా అంచనా వేయకుండా ఎంత ఎక్కువ స్కోరు చేసినా ఫలితం లేదు. చివరకు విజయం ఎవరికి దక్కుతుందన్నది తెలియకుండా ఉంది. నిన్న ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ కూడా అంతే. 214 పరుగులు అంటే ఐపీఎల్‌లో సామాన్యం కాదు. అలాంటి స్కోరును కూడా ఇలా ఊది పారేశారు. కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్లు ఫాంలోకి రావడంతో ఆ జట్టు జయం మనదేనంటూ మైదానంలో నినాదం చేస్తుంది. అలా ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభంలో ఒకలా.. మధ్యలోకి వచ్చే సరికి పూర్తిగా మారిపోయాయి. మరి రానున్న కాలంలో ఏ జట్టు ఎలా ముందుకొస్తుందనేది చూడాల్సిందే.. తప్ప ముందుగా అంచనా వేయడం సాధ్యం కాదు.


Tags:    

Similar News